Ukraine: కుమారుడికి బర్త్‌డే గిఫ్ట్‌గా గ్రనేడ్‌.. అది కాస్తా పేలి మిలటరీ అడ్వైజర్‌ మృతి..!

ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనిక సలహాదారుడికి గ్రనేడ్‌ల పెట్టె బహుమతిగా వచ్చింది. దీనిని అతడి కుమారుడికి చూపే క్రమంలో ఒకటి పేలింది.

Updated : 07 Nov 2023 16:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన కుమారుడికి గ్రనేడ్‌ను చూపించే క్రమంలో ఉక్రెయిన్‌ (Ukraine) అత్యున్నత సైనిక అడ్వైజర్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అతడు ఆ దేశ మిలటరీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌కు సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకొంది. ‘‘నా స్నేహితుడు, సహాయకుడు మేజర్‌ హెన్నాడి చెస్ట్యకోవ్‌ విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అతడికి వచ్చిన బహుమతుల్లో గుర్తు తెలియని పరికరం పేలి మృతి చెందాడు’’ అని జనరల్‌ వాలేరి జలుజ్నీ ప్రకటించారు.

మరో వైపు ఈ ఘటనపై ఆ దేశ ఇంటరీయర్‌ మినిస్టర్‌ ఇగోర్‌ క్లైమెంకో వివరాలను వెల్లడించారు. ‘‘హెన్నాడి కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా బహుమతుల రూపంలో ఒక గ్రనేడ్‌ల పెట్టె వచ్చింది. దీనిని అతడు తన కుమారుడికి చూపించాడు. ఆ సమయంలో ఆ బాలుడు గ్రనేడ్‌ను చేతిలోకి తీసుకొని రింగ్‌ను పట్టుకొని తిప్పడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన అతడు కుమారుడి వద్ద నుంచి గ్రనేడును తీసుకొని దూరంగా వెళ్లాడు. ఈ క్రమంలో అది పేలింది. హెన్నాడికి దానిని ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారో గుర్తించాం. మరి కొన్ని గ్రనేడ్లు కూడా ఆ బహుమతుల్లో  ఉన్నట్లు కనుగొన్నాం. దర్యాప్తు కొనసాగుతోంది’’ అని వెల్లడించారు. ఈ ఘటనలో 13 ఏళ్ల హెన్నాడి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

తొలుత పోలీసులు దీనిని గిఫ్ట్‌బాంబు ఘటనగా అనుమానించారు. కానీ, ఆ తర్వాత అది సహచరుడి నుంచి అందిన బహుమతిగా గుర్తించారు.  మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుంచి అతడు చురుగ్గా ఉక్రెయిన్‌ సైనిక వ్యూహాలను నడుపుతున్నాడు. గతేడాది ఇలానే ఓ బొమ్మలో పేలుడు పదార్థాలను ఉంచి క్రెమ్లిన్‌ సన్నిహితుడిగా పేరున్న ఓ మిలటరీ బ్లాగర్‌కు పంపారు. అది పేలి అతడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని