Zelensky: రష్యా తీరు ISIS కంటే దారుణం : జెలెన్‌స్కీ ఆగ్రహం

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని బాధిత దేశం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఓ ఉక్రెయిన్‌ సైనికుడినిగా భావిస్తోన్న ఓ వ్యక్తిని చంపుతున్న తీరును చూస్తుంటే రష్యా ఐసిస్‌ కంటే దారుణంగా తయారయ్యిందని జెలెన్‌స్కీ తీవ్రంగా మండిపడ్డారు. 

Published : 12 Apr 2023 20:16 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై దురాక్రమణ కొనసాగిస్తోన్న రష్యా (Ukraine Crisis).. అనేక యుద్ధ నేరాలకు పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా (Russia) సైన్యం చేతిలో బందీగా ఉన్న ఓ ఉక్రెయిన్‌ సైనికుడిని అత్యంత దారుణంగా చంపుతున్న (తల తీసివేస్తున్న) ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky).. రష్యాను ఐఎస్‌ఐఎస్‌తో పోల్చారు. రష్యా తీరు ఇస్లామిక్‌ స్టేట్‌ కంటే దారుణంగా ఉందని మండిపడ్డారు.

‘ఐఎస్‌ఐఎస్‌ కంటే అత్యంత దారుణంగా పుతిన్‌ సేనలు ప్రవర్తిస్తున్నాయి. అంత తేలికగా వారెలా చంపేస్తున్నారు. ఈ ఘటనను ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా విస్మరించలేరు. హంతకులు నైతిక బాధ్యత వహించాల్సిందే. ఇటువంటి భయంకర ఘటనలకు పాల్పడుతున్న వారిని ఓడించడం ఎంతో అవసరం. ఈ తరుణంలో ఐరాస భద్రతా మండలికి రష్యా అధ్యక్షత వహించడం అర్థరహితం. ఉక్రెయిన్‌ నుంచి రష్యా ఉగ్రమూకలను తరిమివేయాలి’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. యుద్ధ నేరంగా అనుమానిస్తోన్న ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అటు ఉక్రెయిన్‌ అంతర్గత భద్రతా వ్యవహారాల విభాగం కూడా వెల్లడించింది.

ఉక్రెయిన్‌ సైనికుడితో అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు వచ్చిన వార్తలపై అటు రష్యా కూడా స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో భయంకరంగా ఉందని.. దాని ప్రామాణికతను ధ్రువీకరించాల్సి ఉందని తెలిపింది. ఉక్రెయిన్‌ సైనికులు భుజానికి ధరించే పసుపుపచ్చ బ్యాండు ఉన్న ఓ వ్యక్తిని చంపుతున్నట్లు వీడియోలో ఉంది. అయితే, ఈ పని రష్యా చేసిందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. మరోవైపు దీనిని రష్యా తరఫున వాగ్నర్‌ గ్రూపు చేసి ఉండవచ్చనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని