Russia: ఆరు యుద్ధ విమానాలు ధ్వంసం.. రష్యా ఎయిర్‌బేస్‌పై విరుచుకుపడిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌ దళాలు రష్యాపై విరుచుకుపడ్డాయి. ఓ వైమానిక స్థావరంపై చేసిన దాడిలో ఆరు యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు సిబ్బంది కూడా మరణించినట్లు చెబుతున్నారు.

Published : 05 Apr 2024 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ (Ukraine) ఇంటెలిజెన్స్‌ సంస్థ ఎస్‌బీయూ, సైన్యం సంయుక్తంగా భారీ స్థాయిలో రష్యాపై దాడి చేశాయి. దక్షిణ రోస్టవ్‌లోని మోరోజోవ్స్క్‌ వైమానిక స్థావరంపై నిన్న రాత్రి జరిగిన    ఈ దాడిలో ఆరు విమానాలు పూర్తిగా ధ్వంసం కాగా.. మరో ఎనిమిది వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయని బారెన్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. డజన్ల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. తాము 44 డ్రోన్లను కూల్చివేశామని రష్యా రక్షణశాఖ పేర్కొంది. ఓ పవర్‌ సబ్‌స్టేషన్‌ కూడా ఈ దాడిలో దెబ్బతిన్నట్లు సమాచారం.   

ఈ వైమానిక స్థావరంలో మొత్తం సు-24, సు-34, ఇతర టాక్టికల్‌ బాంబర్‌ విమానాలను ఉంచుతారు. దీనిని రష్యా పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు వినియోగిస్తారు. భద్రతా దళాలకు చెందిన దాదాపు 20 మంది వరకు సిబ్బంది ఈ దాడిలో మరణించి ఉంటారని కీవ్‌ ఇండిపెండెంట్‌ అంచనా వేస్తోంది. రష్యా వాయుసేన శక్తిని ఈ దాడి గణనీయంగా తగ్గిస్తుందని ఉక్రెయిన్‌ చెబుతోంది. మొత్తం 53 డ్రోన్లను ఏకకాలంలో ప్రయోగించినట్లు సమాచారం. ఈ ఎయిర్‌బేస్‌ వద్ద భారీగా పేలుళ్లు జరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు బెల్గరోడ్‌, కరుస్క్‌ వద్ద కూడా ఉక్రెయిన్‌ డ్రోన్లు దాడులకు యత్నించాయి. 

దాదాపు ఏడాది నుంచి రష్యా భూభాగంపై కూడా ఉక్రెయిన్‌ విజయవంతంగా దాడులు చేస్తోంది. ఈ మంగళవారం సెంట్రల్‌ టాటర్‌స్టాన్‌లోని ఓ భారీ చమురు కేంద్రం, డ్రోన్ల అసెంబ్లింగ్‌ యూనిట్లపై కీవ్‌ విరుచుకుపడింది. మరోవైపు క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మాట్లాడుతూ నాటోతో సంబంధాలు బాగా దిగజారాయన్నారు. ఇవి ప్రత్యక్ష పోరు స్థాయికి చేరినట్లు అభివర్ణించారు. కొన్నాళ్ల నుంచి అమెరికా నేతృత్వంలోని ఈ సైనిక కూటమి ఇప్పటికే ఉక్రెయిన్‌తో యుద్ధంలో చేరిందన్నారు. ఇది రష్యా సరిహద్దుల్లోకి వస్తోందని వ్యాఖ్యానించారు.

100 బిలియన్‌ యూరోలు ఉక్రెయిన్‌లో పెట్టుబడి పెట్టాలని నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో పెస్కోవ్‌ ఈవిధంగా స్పందించారు. ఇప్పటికే నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్‌ ప్రత్యక్షంగా బలగాలను ఉక్రెయిన్‌కు పంపేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని