Ukraine: రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌కు ‘కరెంటు కోతల ముప్పు’!

ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోన్న రష్యా.. విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది.

Published : 30 Mar 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా (Russia) భీకర దాడులతో విరుచుకుపడుతోంది. విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఒక్క రోజులోనే 99 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. వీటిలో దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ.. పలుచోట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. గగనతల దాడులతో తమ విద్యుత్‌ సరఫరా వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందని (Ukraine Crisis) తెలిపింది. దేశంలో అనేకచోట్ల కరెంటు కోతల ముప్పు ఉందని హెచ్చరించింది.

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ (Russia Invasion) మొదలుపెట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటికే పలు నగరాలను నేలమట్టం చేసిన పుతిన్‌ సేనలు.. ఇటీవల వైమానిక దాడులను తగ్గించాయి. అయితే, రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ పాల్పడుతున్న దాడులకు ప్రతిస్పందనగా పుతిన్‌ సేనలు ఎదురు దాడులను పెంచాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బొగ్గు, జల విద్యుత్‌ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై యూఎన్‌ స్పందన

విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా తరచూ దాడులు జరుగుతున్నాయని.. ఇటీవల ఈ ముప్పు మరింత పెరిగిందని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా పరిణామాలతో పలుచోట్ల విద్యుత్‌ అంతరాయాలను ప్రకటించినట్లు ప్రధానమంత్రి డెనిస్‌ ష్మిగల్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని ఈ దాడులు నిరూపిస్తున్నాయన్నారు. వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌ మొత్తం వార్నింగ్‌ బెల్‌లు మోగుతూనే ఉన్నాయని ఆ  దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది.

ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థలపై దాడులు చేస్తోన్న రష్యా.. 2022-23 శీతాకాలంలోనూ ఇదేవిధమైన వ్యూహాన్ని అనుసరించింది. అయితే, తాజాగా మరోసారి ఇలాంటి దాడులను పెంచడాన్ని ‘ఇంధన ఉగ్రవాదం’గా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అటు ఐరాస కూడా ఈ తరహా దాడులు అక్రమమని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని