Miss Japan: అఫైర్‌ బయటపడే.. అందాల కిరీటం పోయే..!

ఉక్రెయిన్‌లో జన్మించిన ఓ యువతి, జపాన్‌(Japan)లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. కానీ చిన్న తప్పిదం వల్ల ఆమె సాధించిన విజయం దూరమైంది. 

Updated : 06 Feb 2024 20:15 IST

టోక్యో: దేశం కాని దేశంలో తన ప్రతిభతో అందాల కిరీటాన్ని దక్కించుకుంది ఓ ముద్దుగుమ్మ. కానీ ఓ వివాహితుడితో అఫైర్ నడిపిన కారణంగా ఆమె అరుదైన గౌరవాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మీడియా కథనాల ప్రకారం..

26 ఏళ్ల మోడల్ కరోలినా షినో(Karolina Shiino) గత నెల జరిగిన మిస్‌ జపాన్(Miss Japan) పోటీల్లో విజేతగా నిలిచింది. ఉక్రెయిన్‌లో జన్మించిన ఆమె.. జపాన్‌(Japan)లోనే పెరిగింది. తమ దేశీయురాలు కాని ఆమెకు కిరీటం ఎలా కట్టబెడతారంటూ అప్పటికే విమర్శలు వస్తోన్న తరుణంలో ఆమె గురించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఒక వివాహితుడితో సంబంధం ఉందని స్థానిక మ్యాగజైన్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిపై మొదట అందాల పోటీ నిర్వాహకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆ వ్యక్తి వివాహితుడని ఆమెకు తెలియదని సమర్థించింది.

ఆమె తరఫు మోడల్ ఏజెన్సీ కూడా ఆ వ్యవహారంపై స్పందించింది. ఆ వ్యక్తి మొదట తాను ఒంటరినని షినోను నమ్మించాడని, కొద్దిరోజుల తర్వాత అసలు విషయం ఆమెకు తెలిసిందని వెల్లడించింది. అయితే ఆతర్వాత కూడా అతడితో ఆమె రిలేషన్‌షిప్‌ కొనసాగించినట్లు తెలిపింది. ఇదంతా బయటకు రావడంతో షినో క్షమాపణలు తెలియజేసింది. ‘నా వల్ల కలిగిన అసౌకర్యానికి, నాకు మద్దతు పలికిన వారికి ద్రోహం చేసినందుకు నన్ను మన్నించండి. భయం, గందరగోళం వల్ల నేను నిజం చెప్పలేకపోయాను’ అంటూ ఆమె ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. అలాగే తన మిస్‌ జపాన్‌ కిరీటాన్ని వదులుకుంటున్నట్లు తెలిపారు.

తన టైటిల్‌ను వెనక్కి తీసుకోవాలని కరోలినా చేసిన అభ్యర్థనను మిస్‌ జపాన్‌ నిర్వాహకులు అంగీకరించారు. అలాగే సంబంధిత సంస్థలు, స్పాన్సర్లు, జడ్జిలకు క్షమాపణలు తెలియజేసింది. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది అందాల పోటీలు జరిగేవరకు ఈ టైటిల్ ఖాళీగానే ఉంటుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. కరోలినా ఐదేళ్ల వయసులో తల్లితో సహా ఉక్రెయిన్ నుంచి జపాన్‌ వచ్చింది. దాంతో ఎదిగేక్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నట్లు ఆమె వెల్లడించింది. ఈ పోటీల్లో తనను జపాన్‌ దేశీయురాలిగా గుర్తించినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ ఫైనల్‌ స్పీచ్‌లో ఆమె వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని