Reader's Digest: రీడర్స్‌ డైజెస్ట్‌.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం

రీడర్స్‌ డైజెస్ట్ (Reader's Digest) యూకే ఎడిషన్‌ను మూసివేసినట్లు ఆ సంస్థ ఎడిటర్ ఇన్‌ చీఫ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

Published : 18 May 2024 20:19 IST

లండన్‌: లైఫ్‌స్టైల్ కథనాలు, హెల్త్‌టిప్స్, ఆర్థిక సంబంధ వివరాలతో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న ‘రీడర్స్ డైజెస్ట్‌’ (Reader's Digest) తన చరిత్రలో ఒక అంకాన్ని ముగించింది. సుమారు 86 ఏళ్ల తర్వాత యూకే ఎడిషన్‌ను మూసివేస్తున్నట్లు మేగజైన్ ఎడిటర్ ఇన్‌ చీఫ్ ఎవా మాకేవిక్.. లింక్డిన్‌లో పెట్టిన పోస్టు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మూసివేత గురించి వెల్లడిస్తూ.. ఆమె ఉద్వేగానికి గురయ్యారు.

‘‘రీడర్స్ డైజెస్ట్ (యూకే ఎడిషన్‌) 86 ఏళ్ల అద్భుత ప్రయాణం ముగింపునకు వచ్చింది. ఈ విషయం నన్నెంతగానో ఆవేదనకు గురిచేస్తోంది. ఎనిమిదేళ్లపాటు ఈ ప్రఖ్యాత సంస్థలో సేవలు అందించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దురదృష్టవశాత్తూ నేటి పోటీ ప్రపంచంలో ఆర్థిక ఒత్తిళ్లను తట్టులేకపోయింది’’ అని కొద్దిరోజుల క్రితం ఎవా తన విచారం వ్యక్తంచేశారు. ఈసందర్భంగా తన ప్రయాణాన్ని మరుపురానిదిగా మార్చిన సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతో పలువురు పాఠకులు మేగజైన్‌తో తమకున్న అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ పోస్టులు పెట్టారు.

రీడర్స్ డైజెస్ట్‌ను డివిట్‌ వాలెస్‌, ఆయన సతీమణి లిలా బెల్‌ వాలెస్‌ 1922లో అమెరికాలో స్థాపించారు. 1938లో యూకేలో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దాంతోపాటు పలు దేశాల్లో ఈ మేగజైన్ ప్రచురితమవుతోంది. యూకేకు ముందు చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ సహా పలు దేశాల్లో దీని సేవలు నిలిచిపోయాయి. 1954లో భారత్‌లో తొలి ఎడిషన్ అందుబాటులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని