Russia: కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా

కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది.

Published : 29 Mar 2024 18:49 IST

మాస్కో: ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి (United Nations) విధించిన ఆంక్షలు కొరియా ద్వీపకల్పంలో శాంతిని పెంపొందించడానికి అడ్డంకిగా ఉన్నాయని రష్యా (Russia) ఆరోపించింది. అంతేకాకుండా ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఇవి ఏమాత్రం ఉపయుక్తంగా లేవని తెలిపింది. ఉత్తర కొరియా (North Korea) అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐరాస నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గురువారం రష్యా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మాస్కో, ప్యాంగాంగ్‌ మధ్య ఆయుధాల బదిలీలపై భద్రతా మండలి విచారణ చేపట్టడం మాస్కోకు ఏమాత్రం మింగుడు పడలేదు. ఈనేపథ్యంలోనే తాజా వ్యాఖ్యలు చేసింది.

గత కొన్నేళ్లుగా కొరియా ద్వీపకల్ప ప్రాంతంలో భద్రత పరిస్థితులను మెరుగుపరిచేందుకు తీసుకున్న అంతర్జాతీయ నియంత్రణ చర్యలు ఏమాత్రం ఉపయోగపడలేదని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఓ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఆంక్షల చర్యలను క్రమంగా తగ్గించేందుకు, వాటిని సమీక్షించేందుకు సరైన యంత్రాంగాలు లేనప్పుడు ఇలాంటి చర్యల వల్ల ఏ ఫలితం ఉండబోదని ఆమె పేర్కొన్నారు. ఐరాస నిపుణుల కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు 15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఓటు వేయగా రష్యా వ్యతిరేకించింది. చైనా హాజరుకాలేదు. దీంతో కమిటీ పర్యవేక్షణ నిలిచిపోనుంది. 

ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై ఆంక్షలు మాత్రం కొనసాగుతాయి. ఉత్తర కొరియా నుంచి ఆయుధాలను తెచ్చుకుంటున్న రష్యా.. దానిని కొనసాగించడానికే తీర్మానాన్ని అడ్డుకుందని మిగిలిన దేశాలన్నీ ఆరోపించాయి. రష్యా, ఉత్తర కొరియాల మధ్య చాలా ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభించినప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని