Houthis: హౌతీలపై అమెరికా తొలి ప్రతీకార దాడి

Houthis: హౌతీలపై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు ప్రతీకార దాడులు చేశాయి. యెమెన్‌లోని స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మరిన్ని చర్యలకూ వెనుకాడబోమని హెచ్చరించాయి.

Updated : 12 Jan 2024 08:57 IST

వాషింగ్టన్‌: ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ (Houthis) రెబల్స్‌పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు శుక్రవారం ప్రతీకార దాడులు నిర్వహించాయి. యెమెన్‌లో (Yemen) హౌతీల అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధనౌక నుంచి టొమాహాక్‌ క్షిపణులతో పాటు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. లాజిస్టిక్‌ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, రాడార్‌ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా అధికారులు తెలిపారు.

గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి నిరసనగా హౌతీలు (Houthis) ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని గత కొన్ని నెలలుగా వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీన్ని నిలువరించాలని దాదాపు వారం క్రితం అమెరికా సహా పలు దేశాలు హౌతీలను (Houthis) తీవ్ర స్థాయిలో హెచ్చరించాయి. లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పాయి. అయినా హౌతీలు సంయమనం పాటించకుండా దాడులను కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన అమెరికా తాజాగా ప్రతీకార దాడులను ప్రారంభించింది.

ఈ చర్యలో బ్రిటన్‌ సైన్యం నేరుగా పాల్గొనగా.. ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ తమకు మద్దతిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ‘‘ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛపై హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. అందుకోసం వారు ఉపయోగించిన యెమెన్‌లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేశాం. మా ప్రజలు, అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛా రవాణాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోం’’ అని తేల్చి చెప్పారు.

గత ఏడాది నవంబర్‌ 19 నుంచి ఇప్పటి వరకు ఎర్రసముద్రంలో 27 దాడులకు పాల్పడిన హౌతీలు.. తాజా అమెరికా సైన్యం ప్రతీకార చర్యలపై స్పందించారు. యెమెన్‌లోని తమ స్థావరాలపై దాడికి తీవ్ర సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని