Israel: ఇజ్రాయెల్‌కు అమెరికా రెండు వేల బాంబులు

ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని రఫాపై సైనిక దాడులతో విరుచుకుపడుతున్న సమయంలో అమెరికా కొత్త ఆయుధ ప్యాకేజీలో భాగంగా ఇజ్రాయెల్‌కు రెండు వేలకు పైగా బాంబులు, ఫైటర్‌ జెట్‌లను సరఫరా చేసినట్లుగా అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

Updated : 30 Mar 2024 18:36 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ దళాలు గాజాలోని రఫాపై సైనిక దాడులతో విరుచుకుపడుతున్న సమయంలో ప్రపంచ దేశాలతో సహా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.  అయినప్పటికీ తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు యుద్ధంలో సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. 

తాజాగా కొత్త ఆయుధ ప్యాకేజీలో భాగంగా ఇజ్రాయెల్‌కు రెండు వేలకు పైగా బాంబులు, ఫైటర్‌ జెట్‌లను సరఫరా చేసినట్లుగా అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంతే కాకుండా వార్షిక సైనిక సహాయంగా 3.8 బిలియన్‌ డాలర్లను అందజేసింది.

కాగా ఇజ్రాయెల్‌కు ఆయుధాల బదిలీపై వైట్‌హౌస్ స్పందించలేదు. వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. గతేడాది అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి  ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ సైనికులు చేపట్టిన అమానవీయ దాడులపై అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేయడం విమర్శలకు దారి తీసింది. గాజాపై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకూ 32,000 మంది వ్యక్తులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

గాజాలో తక్షణ కాల్పుల విరమణను కోరే తీర్మానంపై ఓటింగ్‌కు అమెరికా దూరంగా ఉంది. ఇజ్రాయెల్‌కు సైనిక నిధులు నిలిపివేయాలని డెమొక్రటిక్‌ పార్టీలోని కొందరు సభ్యులు జో బైడెన్‌ను కోరినా ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టింది. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణ, ఇజ్రాయెల్‌ సైనిక దాడికి అమెరికా మద్దతివ్వడంతో అనేక మంది అరబ్‌ అమెరికన్లు బాధపడుతున్నారని శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బైడెన్‌ అంగీకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు