US: డీప్‌ఫేక్‌ ఎఫెక్ట్‌.. ‘ఏఐ వాయిస్‌ రోబోకాల్స్‌’పై అమెరికా నిషేధం

AI-generated robocalls: ఏఐ ఆధారిత రోబోకాల్స్‌పై అమెరికా నిషేధం విధించింది. అధ్యక్షుడు జో బైడెన్‌ వాయిస్‌ను అనుకరిస్తూ నకిలీ ఫోన్‌ కాల్స్‌ వైరల్‌ అయిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది.

Published : 12 Feb 2024 17:04 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా (USA)లో ఇటీవల ‘డీప్‌ఫేక్‌’ కలకలం సృష్టించింది. ఏకంగా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) వాయిస్‌ను అనుకరించేలా కొందరు మోసగాళ్లు ఏఐ-ఆధారిత ఫోన్‌కాల్స్‌ (AI-generated robocalls)ను సృష్టించి తప్పుడు ప్రచారానికి తెర తీశారు. దీంతో అప్రమత్తమైన అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఏఐ- ఆధారిత వాయిస్‌ రోబోకాల్స్‌’పై నిషేధం విధించింది. ఈమేరకు ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘‘కొంతమంది నేరగాళ్లు కృత్రిమమేధ సాంకేతికతను ఉపయోగించి నకిలీ వాయిస్‌ రోబోకాల్స్‌ను సృష్టిస్తున్నారు. వాటితో ప్రముఖుల కుటుంబాలను బెదిరించడం, సెలబ్రిటీలను ఇమిటేట్‌ చేసి తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఆడియో, వీడియో కాల్స్‌ను సృష్టించినా.. ఇప్పుడు ఉన్న అధునాతన సాంకేతికతతో ఈ నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో ఇలాంటి ఫేక్‌ రోబోకాల్స్‌ కొత్త ముప్పును తెచ్చిపెడుతున్నాయి’’ అని ఎఫ్‌సీసీ కమిషనర్‌ జియోఫ్రే స్టార్క్స్‌ తెలిపారు. అందుకే ఇలాంటి ఏఐ ఆధారిత రోబోకాల్స్‌పై నిషేధం విధిస్తున్నామని, తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. కంపెనీలు వీటిని సృష్టించినా, ప్రసారం చేసినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

టిక్‌టాక్‌ వినియోగం మొదలుపెట్టిన బైడెన్‌..!

ఇటీవల బైడెన్‌ను అనుకరిస్తూ నకిలీ రోబోకాల్స్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన డెమోక్రాట్‌ ప్రైమరీ ఎన్నికల సమయంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేయొద్దని బైడెన్‌ చెప్పినట్లు అందులో ఉండటం కలకలం సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని