ఆ విషాదం మరువకముందే.. టైటాన్‌ తరహాలో మరో సాహస యాత్ర..!

టైటాన్‌ మినీ జలాంతర్గామి విషాద ఘటన మరువకముందే.. అదేతరహాలో మరో యాత్రకు రంగం సిద్ధం అవుతోంది. ఈసారి యాత్రలో ట్రిటాన్ సబ్‌మెరైన్స్ (Triton Submarines) సంస్థ భాగం కానుంది. 

Updated : 28 May 2024 14:39 IST

(టైటాన్‌ మినీ జలాంతర్గామి)

వాషింగ్టన్‌: టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్‌ (Titan Submarine) మినీ జలాంతర్గామి విషాదాంతం సంగతి తెలిసిందే. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో ఇద్దరు వ్యక్తులతో మరో యాత్రకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలోని ఒహాయోకు చెందిన రియల్‌ ఎస్టేట్ ఇన్వెస్టర్ లారీ కానర్‌.. ఈ సాహస యాత్రను సురక్షితంగా పూర్తిచేయొచ్చని నిరూపించాలనుకుంటున్నారు. ఈసారి ట్రిటాన్ సబ్‌మెరైన్స్ (Triton Submarines) సహ వ్యవస్థాపకుడు పాట్రిక్‌ లాహేతో పాటు లారీ.. సముద్రంలో 12,400 అడుగుల లోతు వరకు వెళ్లనున్నారు. ఈమేరకు ఆయన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. 

‘‘మహాసముద్రం ఎంతో శక్తివంతమైనదే అయినా.. సరైనమార్గంలో వెళితే అదొక అద్భుతమని, జీవితాన్ని మార్చేస్తుందని తెలియజేయాలని అనుకుంటున్నాను. ఈ మినీ జలాంతర్గామి (Triton 4000/2 Abyssal Explorer) రూపకల్పనకు పాట్రిక్ పదేళ్లకు పైగా కష్టపడ్డారు. గత ఏడాది టైటాన్‌ పేలుడు వార్త వినగానే వెంటనే నేను పాట్రిక్‌కు కాల్‌ చేశాను. దానికంటే మెరుగైన వెస్సెల్‌ను తయారుచేయాలని చెప్పాను’’ అని కానర్ వెల్లడించారు. లాహే మాట్లాడుతూ.. ‘‘పదేపదే సురక్షిత ప్రయాణాలు చేయగల, టైటాన్‌కు విరుద్ధమైన వాహక నౌకను చేయగలరని ప్రపంచానికి చాటిచెప్పాలని కానర్ నాకు చెప్పేవారు’’ అని తెలిపారు. అయితే వారి ప్రయాణం ఎప్పుడు ఉంటుందో తెలియాల్సి ఉంది. 

గత ఏడాది జూన్‌లో అట్లాంటిక్‌ మహాసముద్రంలో సుమారు 13 వేల అడుగుల లోతులోని టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో బయల్దేరిన టైటాన్‌ మార్గమధ్యలోనే పేలిపోయింది. టైటానిక్‌కు సుమారు 480 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. అందులోని ఆక్సిజన్‌ నాలుగు రోజులకు (96 గంటలకు) సరిపడా ఉండటంతో ఉద్ధృతంగా రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటినుంచి ఈ మినీ జలాంతర్గామి సంస్థ ఓషన్‌గేట్ తన సాహసయాత్రలను నిలిపివేసింది. ఆ ఘటనలో ఓషన్‌గేట్‌ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి స్టాక్టన్‌ రష్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. టైటాన్‌ యాత్రకు ముందూ, తర్వాత దాని భద్రతా ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తంచేస్తూ విమర్శలు చేసినవారిలో లాహే కూడా ఒకరు కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని