China: అగ్నికి ఆజ్యం.. తైవాన్‌కు చేరుకొన్న అమెరికా కాంగ్రెస్‌ బృందం

తైవాన్‌ విషయంలో చైనాకు హెచ్చరికలు పంపేలా అమెరికా చర్యలు చేపట్టింది. తమ దేశ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందాన్ని అక్కడకు పంపింది.

Updated : 27 May 2024 10:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌ (Taiwan) విషయంలో చైనా(China)ను హెచ్చరించేలా చర్యలను అమెరికా చేపట్టింది. కాంగ్రెస్‌ సభ్యులను తైపీకి పంపింది. ఆ బృందం ఇక్కడ రెండు రోజులపాటు పర్యటించనుంది. కొత్త అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌తో అమెరికా సంబంధాలను బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు కూడా జరపనుంది. అంతేకాదు.. వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, పెట్టుబడులు, పరస్పర ప్రయోజనాలు వంటి అంశాల పై కూడా దృష్టి పెట్టనుంది. ఈ బృందంలో ది హౌస్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీ అధ్యక్షుడు మిషెల్‌ మెక్‌కౌల్‌ కూడా సభ్యుడు కావడం విశేషం. ఆయన వెంట రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ సభ్యలు తైవాన్‌కు చేరుకొన్నారు. చైనా విషయంలో ఆయన చాలా కఠినంగా మాట్లాడతారన్న పేరుంది. గతేడాది ఆయన తైవాన్‌ సందర్శించిన వేళ చైనా అధినేత జిన్‌పింగ్‌ను హిట్లర్‌తో పోల్చడం సంచలనం సృష్టించింది. 

తాజాగా మెక్‌కౌల్‌ మాట్లాడుతూ ‘‘తమ పర్యటనతో తైవాన్‌ ప్రజలకు అండగా అమెరికా ఉందన్న సంకేతాలు చైనా కమ్యూనిస్టు పార్టీకి వెళతాయి. తైవాన్‌ జలసంధిలో యథాతథ స్థితి కొనసాగేలా తాము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు. 

తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో చైనా (China) వ్యతిరేకిగా పేరొందిన లాయ్‌ చింగ్‌-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బాధ్యతలు చేపట్టారు. అధ్యక్ష హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లాయ్‌ తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌కు గట్టిగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన బీజింగ్‌.. తైవాన్‌ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ‘పనిష్మెంట్‌’ (Punishment) పేరుతో వీటిని నిర్వహించింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ మిలిటరీ డ్రిల్స్‌ (Military Drills) నిర్వహించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ‘‘స్వాతంత్ర్యం కోసం తైవాన్‌ దళాల వేర్పాటువాద చర్యలకు శిక్షగానే మేం ఈ విన్యాసాలు చేపట్టాం. మా విషయంలో బయటి శక్తుల (అమెరికాను ఉద్దేశిస్తూ) జోక్యం, రెచ్చగొట్టే చర్యలకు ఇది మా హెచ్చరిక’’ అని ఈ కమాండ్‌ అధికార ప్రతినిధి లి షీ వెల్లడించారు. రెండ్రోజులపాటు ఇవి జరిగాయి. దీనిపై తైవాన్‌ అధ్యక్షుడు స్పందిస్తూ.. చైనాతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ప్రాంతీయ స్థిరత్వానికి కీలకమని, అంతర్జాతీయ భద్రతకూ ముఖ్యమని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని