Panchen Lama: పంచన్‌ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా

పంచన్‌ లామా ఆచూకీని చైనా ప్రకటించాలని అమెరికా మరోసారి డిమాండ్‌ చేసింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. 

Updated : 19 May 2024 14:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా-చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు కావాల్సిన పంచన్‌ లామా (Panchen Lama) ఆచూకీని బీజింగ్‌ ప్రకటించాలని వాషింగ్టన్‌ డిమాండ్‌ చేసింది. సురక్షితంగా ఉన్నాడా?లేడా? అన్న విషయాన్ని వెల్లడించాలని కోరింది. హిమాలయాల్లో పంచన్‌ లామా అదృశ్యమై 29 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యు మిల్లర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘11వ పంచన్‌ లామాగా ఎంపికైన బాలుడు గెధున్‌ చౌకీ నీమాను చైనా అపహరించి నేటికి 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ చిన్నారి టిబెట్‌ బుద్ధిజానికి చాలా కీలక వ్యక్తి. కిడ్నాప్‌నకు గురయ్యే నాటికి ఆ బాలుడి వయసు ఆరేళ్లు. నేటి వరకు బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. పంచన్‌ లామా వద్దకు ఎవరినీ వెళ్లనీయడంలేదు. ఆ స్థానంలో మరో బాలుడిని తీసుకొచ్చింది. పీఆర్‌సీ అధికారులు తక్షణమే గెధున్‌ ఆచూకీ వెల్లడించాలి. అతడి మానవ హక్కులను కాపాడాలి. తక్షణమే బేషరతుగా పంచన్‌ లామాను విడుదల చేయాలి’’ అని అమెరికా విదేశాంగ శాఖ డిమాండ్‌ చేసింది. 

కిడ్నాప్‌.. కుట్ర కథ ఇదీ..

1950లో చైనా టిబెట్‌పై ఆక్రమణ ప్రారంభించింది. 1959లో టిబెట్ తిరుగుబాటు చేసింది.. అది విఫలం కావడంతో అక్కడి బౌద్ధ మత గురువు దలైలామా భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఆయన ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న 10వ పంచన్‌ లామా లోబ్సాంగ్‌ గ్యాల్సెన్‌ మాత్రం టిబెట్‌లోనే ఉండిపోయారు. మరోపక్క చైనా ఆగడాలను దలైలామా ప్రపంచ వ్యాప్తంగా వెల్లడించడం మొదలుపెట్టారు. దీంతో భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది. ఈ దలైలామా ఎంపికలో పంచన్‌ లామా పాత్ర చాలా కీలకం. 1989లో టిబెట్‌లోనే ఉండిపోయిన పంచన్‌ లామా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనపై విష ప్రయోగం చేశారంటారు. 

దలైలామా 1995 మే 14న ఆరేళ్ల బాలుడైన గెధున్‌ చోకీ నీమా పేరును 11వ పంచన్‌ లామాగా ప్రకటించారు. దీంతో చైనా ఆగ్రహం కట్టలు తెంచుకొంది. సరిగ్గా మూడు రోజుల తర్వాత చైనా సైన్యం ఆ బాలుడిని కిడ్నాప్‌ చేసింది. అప్పటి నుంచి అతడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు