Death Sentence: రక్తనాళం దొరక్క.. నిలిచిపోయిన మరణశిక్ష!

రక్తనాళం దొరక్కపోవడంతో మరణశిక్ష (Death Sentence) నిలిచిపోయిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

Published : 29 Feb 2024 14:13 IST

వాషింగ్టన్‌: రక్తనాళం దొరక్కపోవడంతో మరణశిక్ష (Death Sentence) నిలిచిపోయిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇచ్చేందుకు వైద్య బృందం అనేక సార్లు ప్రయత్నించారట. అయినప్పటికీ ఖైదీ రక్తనాళం కనుక్కోవడంలో విఫలమయ్యారు. దీంతో చేసేదేమీ లేక మరణశిక్షను (Execution) నిలిపివేశారు.

అమెరికాకు చెందిన థామస్‌ యూజీన్‌ క్రీచ్‌ (73).. ఓ సీరియల్‌ కిల్లర్‌. మూడు రాష్ట్రాల్లో ఐదు హత్యలకు పాల్పడ్డాడు. అనేక కేసుల్లో అనుమానితుడిగా ఉన్నాడు. దాదాపు అర్ధశతాబ్దిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 1981లో తోటి ఖైదీపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులోనే థామస్‌కు మరణశిక్ష పడింది.

నైట్రోజన్‌తో మరణశిక్ష అమలు

అమెరికాలో సుదీర్ఘకాలంగా మరణశిక్ష ఎదుర్కొంటున్న దోషుల్లో ఒకరైన థామస్‌కు (Thomas Creech) ఇటీవల శిక్ష పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇడాహోలోని మరణశిక్ష ఛాంబర్‌లోకి తీసుకెళ్లారు. ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇచ్చి అమలు చేయాల్సి ఉంది. ఇందుకోసం ముగ్గురు వైద్య సిబ్బంది అతడి చేతులు, కాళ్లు, భుజాలతోపాటు ఇతర ప్రాంతాల్లో రక్తనాళం కోసం వెతికారు. ఇలా గంటపాటు దాదాపు ఎనిమిది సార్లు వెతికినప్పటికీ సరైన రక్తనాళం లభించలేదు. దీంతో చేసేదేమీ లేక మరణశిక్ష అమలును విరమించుకున్నారు.

థామస్‌ ‘డెత్‌ వారెంట్‌’ గడువు ముగిసిపోతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో మానవీయ, రాజ్యాంగబద్ధమైన విధానంలో మరణశిక్షను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ దోషి తరఫు న్యాయవాది స్థానిక కోర్టును ఆశ్రయించాడు. విచారించిన న్యాయస్థానం.. ఈ ‘డెత్‌ వారెంట్‌’ ముగిసేలోపు మరోసారి మరణశిక్ష అమలుకు ప్రయత్నించవద్దంటూ ఆదేశించింది. దీంతో శిక్ష అమలు చేయాలంటే అధికారులు కొత్తగా మరో వారెంట్‌ను పొందాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని