పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు

నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్య కుట్ర వెనుక భారతీయ వ్యక్తిపై తాజాగా అమెరికా(USA) అభియోగాలు మోపింది.

Published : 30 Nov 2023 11:17 IST

వాషింగ్టన్‌: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ(Gurpatwant Singh Pannun) హత్యకు అమెరికా(USA)లో కుట్ర జరిగిందంటూ కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మీడియా సంస్థ కథనంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ హత్య కుట్రలో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా అనే వ్యక్తి ప్రమేయం ఉందంటూ తాజాగా అమెరికా అటార్నీ కార్యాలయం ఆరోపించింది. ‘సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని బహిరంగంగా ప్రచారం చేసే భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడిపై న్యూయార్క్‌లో హత్యకు కుట్ర జరిగింది.  ఈ నిమిత్తం నిందితుడికి భారత్ నుంచి ఆదేశాలు అందాయి’ అని యూఎస్‌ జస్టిస్‌ విభాగం అభియోగాలు మోపించింది. అయితే, ఈ అభియోగ పత్రాల్లో పన్నూ పేరును ప్రస్తావించలేదు.

నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా(USA) ఒత్తిడి తెస్తోంది. ఈ కేసును తాము పరిశీలిస్తున్నామని, ఈ హత్యకోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని భారత వర్గాలు పేర్కొన్నాయి. ఈ హత్య కుట్రలో అతడి ప్రమేయం లేకపోవడంతో అమెరికా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వ్యాఖ్యానించాయి. ఈ కేసుల కారణంగా అమెరికా-భారత్‌ మధ్య సంబంధాలు దెబ్బతినకుండా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే అవసరమైతే, గుప్తాకు న్యాయ సాయం అందిస్తామన్నాయి. ఇక  ఈ కేసులో నిఖిల్‌ గుప్తా దోషిగా తేలితే గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది.

రవిశర్మ.. రంగు మారి నిజ్జర్‌!

పన్నూ హత్య కుట్రను అగ్రరాజ్యం భగ్నం చేసిందని, ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు గతంలో అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటనపై అమెరికా ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనిపై అప్పుడు భారత విదేశాంగ స్పందించింది. ‘భారత్‌-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య సంబంధాలు తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారమిచ్చారు. ‘ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశాం. దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా భారత్‌ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుంది’ అని తాజాగా భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.  

స్పందించిన కెనడా..

ఇది వరకు కెనడా(Canada) కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికా అభియోగాల నేపథ్యంలో ట్రూడో మరోసారి స్పందించారు. ‘అమెరికా నుంచి వస్తున్న వార్తలు.. మేం మాట్లాడుతున్న విషయానికి మరింత బలం చేకూరుస్తున్నాయి. భారత్ దీనిని తీవ్రంగా పరిగణించాల్సి అవసరం ఉంది’ అని ఆయన మీడియాతో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని