USA: అమెరికా గగనతలంలో మరోసారి బెలూన్ కలకలం..

అమెరికా(USA) గగనతలంలో మరోసారి బెలూన్‌ కనిపించింది. దానిని యుద్ధ విమానాలు అడ్డుకున్నాయని అధికారులు తెలిపారు.

Published : 24 Feb 2024 20:35 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా(USA) గగనతలంలో మరోసారి బెలూన్(Balloon) కలకలం సృష్టించింది. పశ్చిమం దిశగా ప్రయాణిస్తోన్న దానిని యుద్ధ విమానాలు అడ్డగించాయి. ఫిబ్రవరి 23న ఈ ఘటన జరిగిందని, అయితే ఇంకా దాన్ని కూల్చివేయలేదని అమెరికా అధికారులు ధ్రువీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. దానివల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని వారు పేర్కొన్నారు.

‘ఉతాహ్ మీదుగా ప్రయాణిస్తోన్న బెలూన్‌ను నార్త్‌ అమెరికన్ ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ కమాండ్(NORAD)కు చెందిన యుద్ధ విమానాలు అడ్డగించాయి. వీటివల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది. అలాగే విమానాల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌(FAA) తెలిపింది. విమానాల భద్రతను నిర్ధారించేందుకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి’ అని NORAD ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ బెలూన్  ఏ దేశం/సంస్థదో తెలియాల్సిఉంది. అలాగే దాని ప్రయోగం వెనక ఉద్దేశం కూడా వెల్లడి కాలేదు. దీనిని అడ్డగించడానికి ముందు అది కొలరాడో, ఉతాహ్‌ గగనతలంలో కనిపించిందని సంబంధిత అధికారులు తెలిపారు. దానికి స్వయంచోదక సామర్థ్యం లేదని చెప్పారు.

గత ఏడాది కూడా అమెరికాలో బెలూన్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. అది చైనా గూఢచర్య బెలూన్‌ అని అమెరికా ఆరోపించింది. అలాగే దానిని కూల్చివేసింది. అయితే అది వాతావరణ పరిశోధనలకు చెందిందని అప్పట్లో చైనా బదులిచ్చింది. గాలుల ప్రభావంతో పాటు, స్వయంచోదక సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల దశ తప్పి వచ్చిందని డ్రాగన్‌ వివరించింది. ఆ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు