Leaked Secret: రష్యాకు రహస్యంగా 40వేల రాకెట్లు..! లీకైన పత్రాల్లో ‘ఈజిప్టు ప్రణాళిక’

ఉక్రెయిన్‌ యుద్ధానికి (Ukraine Crisis) సంబంధించి అమెరికా రూపొందించిన కీలక నివేదికలు లీకైనట్లు (Leaked Secrets) వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రష్యాకు 40వేల రాకెట్లను అందించేందుకు ఈజిప్టు ప్రణాళిక సిద్ధం చేసిందనే తాజా నివేదిక వెల్లడించింది.

Published : 11 Apr 2023 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌ యుద్ధంపై (Ukraine Crisis) అమెరికా నిఘా సంస్థలు రూపొందించిన రహస్య పత్రాలు లీకు (Leaked Documents) కావడం పాశ్చాత్య దేశాల్లో కలవరం రేపుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై ఏడాది కాలంగా చేస్తోన్న యుద్ధంతో ఆయుధ నిల్వలను కోల్పోతున్న రష్యాకు (Russia) ఈజిప్టు సహాయం చేసేందుకు సిద్ధమైందనే వార్తలు బయటకు వచ్చాయి. ఇందులో భాగంగా ఈజిప్టు 40వేల రాకెట్లను తయారు చేసి వాటిని రష్యాకు రహస్యంగా తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని అమెరికా వార్తా సంస్థ ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెల్లడించింది.

రష్యాకు ఆయుధ సాయాన్ని అందించే విషయంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి తన సైనికాధికారులతో ఇటీవల రహస్యంగా భేటీ అయ్యారట. రష్యాకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించడంపైనా చర్చించినట్లు సమాచారం. అయితే, పాశ్చాత్య దేశాల నుంచి ఇబ్బంది రాకుండా ఈ ప్రణాళికనంతా రహస్యంగా ఉంచాలని అధికారులకు సూచించినట్లు తాజా కథనం పేర్కొంది. అయితే, ఈ విషయాలు తెలుసుకున్న అమెరికా అధికారులు నిర్ఘాంతపోయినట్లు తెలిసింది.

మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా ఈజిప్టు కొనసాగుతోంది. గతేడాది నవంబర్‌లో ఈజిప్టులో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఎల్‌-సిసితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌- రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో ఈజిప్టు నిర్ణయాన్ని బైడెన్‌ ప్రశంసించారు. ఈ తరుణంలో ఒకవేళ రష్యాకు ఈజిప్టు అధ్యక్షుడు రహస్యంగా ఆయుధ సంపత్తిని సమకూర్చాలని భావిస్తే మాత్రం అవి ఇరు దేశాల సంబంధాలను తీవ్ర ప్రభావితం చేస్తాయని అమెరికాకు చెందిన ఓ సెనెటర్‌ క్రిస్‌ మర్ఫీ వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ మాత్రం ఈ డాక్యుమెంట్లను ధ్రువీకరించేందుకు నిరాకరించారు. ఇవి ప్రజా వినియోగానికి కాదని హెచ్చరించారు.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌లో రష్యా చేస్తోన్న యుద్ధానికి సంబంధించిన కీలక సమాచారంపై అమెరికా రక్షణశాఖ కొన్ని నివేదికలు రూపొందించినట్లు సమాచారం. ఇరుదేశాల సైనికుల మరణాల సంఖ్య, సైన్యాలకున్న ముప్పు, సైనిక శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తికి చెందిన డేటా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ఉక్రెయిన్‌కు అమెరికా అందించిన ఆయుధాలు, శిక్షణ సహాయం, సైనిక వ్యూహాలతోపాటు అత్యంత రహస్యం అని పేర్కొన్న మ్యాప్‌లు, ఫొటోలు కూడా అందులో ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా ఇవి లీకైనట్లు వార్తలు వస్తుండటం చర్చనీయాంశమయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని