UNSC: ఐరాసలో భారత్‌కు వీటో అధికారం.. మస్క్‌ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..

UNSC: ఐరాసలో సంస్కరణలకు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్‌ ప్రతిపాదనపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated : 18 Apr 2024 09:19 IST

వాషింగ్టన్‌: భద్రతా మండలి (UNSC) సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ బుధవారం స్పష్టం చేసింది. యూఎన్‌ఎస్సీలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఇటీవల ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ అగ్రరాజ్య విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ పై వ్యాఖ్యలు చేశారు.

‘‘ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) గతంలో సర్వప్రతినిధి సభలో మాట్లాడారు. విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చారు. భద్రతా మండలి సహా ఐరాస సంస్థల్లో సంస్కరణలకు మేం ఎప్పుడూ అనుకూలమే. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలి’’ అని మీడియా సమావేశంలో వేదాంత్‌ పటేల్‌ అన్నారు.

భారత్‌-పాక్‌ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా

UNSCలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) జనవరిలో ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. అత్యధిక జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం లేకపోవడానికి తప్పుబట్టారు. ఆఫ్రికా దేశాలన్నింటికీ కలిపి కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వర్ధమాన దేశాల ప్రయోజనాలు కాపాడేందుకు సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉందని భారత్‌ సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తోంది. దీనికి అంతర్జాతీయ సమాజం సైతం మద్దతునిస్తుండడం విశేషం.

యూఎన్‌ఎస్సీలో (UNSC) మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. వీటిలో చైనా, యూకే, ఫ్రాన్స్‌, రష్యా, అమెరికాకు శాశ్వత సభ్యత్వం పేరిట వీటో అధికారం ఉంది. మరో పది దేశాలు రెండేళ్ల కాలపరిమితితో తాత్కాలిక సభ్యదేశాలుగా ఎన్నికవుతూ ఉంటాయి. ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం చర్యలు తీసుకుంటామని ఇటీవల విడుదలైన మేనిఫెస్టోలో భాజపా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని