USA: అమెరికా దాడిలో ఇరాన్‌ మద్దతున్న కీలక కమాండర్‌ మృతి

USA: జోర్డాన్‌లో తమ సైనికుల మరణానికి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా తమ దాడుల్లో ఇరాన్‌ మద్దతున్న ఓ కీలక కమాండర్‌ మృతి చెందినట్లు సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది.

Updated : 08 Feb 2024 14:39 IST

వాషింగ్టన్‌: ఇరాక్‌లోని (Iraq) మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ మద్దతున్న ఓ కీలక కమాండర్‌ హతమైనట్లు అమెరికా (USA) సైన్యం ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్య స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో అతడి హస్తం ఉందని తెలిపింది. జోర్డాన్‌లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే తాము ఈ దాడి చేశామని వివరించింది.

బాగ్దాద్‌లో కారులో వెళ్తున్న కమాండర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు యూఎస్‌ సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని తెలిపారు. కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బహుశా ఆర్‌9ఎక్స్‌ అనే హెల్‌ఫైర్‌ రకం క్షిపణిని ఉపయోగించి ఉంటారని అమెరికా మాజీ సైనికాధికారి ఒకరు తెలిపారు. పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. 2020లో ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కీలక కమాండర్‌ ఖాసీమ్‌ సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది.

ఇరాన్‌ మద్దతున్న కతైబ్‌ హెజ్‌బొల్లా మిలిటెంట్‌ గ్రూప్‌ మరికొన్ని సంస్థలతో కలిసి మధ్యప్రాచ్యంలోని తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని అమెరికా తెలిపింది. అందులో భాగంగా ఇటీవల జోర్డాన్‌లో దాడి జరిగినట్లు గుర్తుచేసింది. వాటికి ప్రతీకారంగా ఇరాక్‌, సిరియాల్లో ఇరాన్‌ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్‌ గ్రూప్‌లపై దాడులు చేస్తున్నట్లు వివరించింది. ఈ క్రమంలో బుధవారం కతైబ్‌ హెజ్‌బొల్లాకు చెందిన కీలక కమాండర్‌ అబూ బకర్‌ అల్‌-సాదిని మట్టుబెట్టామని తెలిపింది. దీన్ని ఆ సంస్థతో పాటు ఇరాక్‌ ఇంటీరియర్‌ మంత్రిత్వశాఖ అధికారి సైతం ధ్రువీకరించారు.

స్వయం ప్రకటిత పారామిలిటరీ గ్రూప్‌ల సంకీర్ణం హషెద్‌ అల్‌-షాబీ.. అమెరికా చర్యలను ఖండించింది. శుక్రవారం అగ్రరాజ్యం జరిపిన దాడిలో 16 మంది తమ ఫైటర్లు మరణించినట్లు వెల్లడించింది. మరో 36 మంది గాయపడ్డారని తెలిపింది. హషెద్‌ అల్‌-షాబీని లక్ష్యంగా చేసుకోవటం నిప్పుతో చెలగాటమేనని ఆ గ్రూప్‌ నాయకుడు ఫలేహ్‌ అల్‌-ఫయ్యద్‌ హెచ్చరించారు. మరోవైపు అమెరికా (USA) దళాలు సిరియాలో చేసిన దాడుల్లో ఇరాన్‌కు మద్దతుగా పోరాడుతున్న 29 మంది మరణించారని ఓ మానవహక్కుల సంస్థ తెలిపింది.

ఇరాక్‌లోని అమెరికా (USA) బలగాల ఉపసంహరణపై జనవరి నుంచి చర్చలు మొదలయ్యాయి. కచ్చితమైన గడువును తెలియజేయాలని ఇరాక్‌ ప్రధాని కోరుతున్నారు. ఉగ్రసంస్థ ఐసిస్‌పై పోరాటంలో భాగంగా ప్రస్తుతం ఇరాక్‌లో 2,500, సిరియాలో 900 మంది సైనికులను అమెరికా మోహరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని