Modi: మణిపుర్ కల్లోలం.. మోదీకి మద్దతుగా అమెరికన్‌ సింగర్ ట్వీట్‌

మణిపుర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై విపక్షపార్టీలు కేంద్రప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ(Modi)కి అమెరికను సింగర్ నుంచి మద్దతు లభించింది. 

Updated : 11 Aug 2023 10:57 IST

దిల్లీ: మణిపుర్ అంశం( Manipur violence)పై ప్రధాని నరేంద్రమోదీ(Modi)కి అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ మేరీ మిల్బెన్‌(Mary Milliben) నుంచి మద్దతు లభించింది. ఆయన ఈశాన్యరాష్ట్ర ప్రజల కోసం నిత్యం పోరాడుతుంటారని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా చివరగా గురువారం ప్రధాని మాట్లాడారు. అది ముగిసిన కొద్దిసేపటికే మిల్బెన్‌ నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

‘నిజం ఏమిటంటే.. భారత ప్రజలకు తమ నేతపైన విశ్వాసం ఉంది. మణిపుర్, భారత్‌కు చెందిన మహిళలు, కుమార్తెలకు న్యాయం అందుతుంది. ప్రధాని మోదీ ఎప్పుడూ మీ స్వేచ్ఛ కోసమే పోరాడుతుంటారు. విపక్షాలు ఎలాంటి విషయం లేకుండా రాద్దాంతం చేస్తుంటాయి. విదేశాల్లో తన దేశాన్ని అగౌరవపరచడం నాయకత్వం కాదు. కానీ నిజం ఎల్లప్పుడూ ప్రజలు స్వేచ్చగా ఉండేలా చూస్తుంది’ అని మిల్బెన్‌ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు. అలాగే తనకు ప్రధాని మోదీపై విశ్వాసం ఉందని, ఆయన కోసం ప్రార్థిస్తానన్నారు. స్వేచ్ఛ గురించి ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్‌ కింగ్ జూనియర్ చేసిన కోట్‌ను ప్రస్తావించారు.

పాము- డేగల బతుకు పోరాటం.. మహిళ ప్రాణాలతో చెలగాటం..!

ఇటీవల ప్రధాని మోదీ(Modi) అమెరికా(USA) పర్యటనలో భాగంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో మేరీ మిల్బెన్‌(Mary Milliben) భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. భారత ప్రధాని కోసం జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో గౌరవంగా ఉందని అప్పుడు మిల్బెన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో ఆమె మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రముఖ ఆఫ్రికన్‌ - అమెరికన్‌ హాలీవుడ్‌ నటి, గాయని అయిన మిల్బెన్‌ గతంలో భారత జాతీయ గీతం ‘జనగణమన’, ‘ఓం జై జగదీశ్‌ హరే’ పాడి భారతీయులకు సుపరిచితురాలయ్యారు.

నిన్న అవిశ్వాస తీర్మానంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాలను తాము కాంగ్రెస్‌ మాదిరిగా ఓట్లతో తులాభారం వేయకుండా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేస్తున్నామని, ఆ ప్రాంతం తమ మానస పుత్రిక అని అభివర్ణించారు. గత 9 ఏళ్లలో అక్కడ రూ.లక్షల కోట్లు ఖర్చుపెట్టినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని