USA: కేజ్రీవాల్‌ అంశంలో మాకు పక్షపాతం లేదు: వివరణ ఇచ్చిన అమెరికా

కేజ్రీవాల్‌ విషయంలో తాము పక్షపాత వైఖరితో వ్యవహరించలేదని అమెరికా విదేశాంగశాఖ వివరణ ఇచ్చింది. భారత్‌ అంతర్గత విషయంలో జోక్యంపై విమర్శలు రావడంతో ఈ మేరకు స్పందించింది.

Published : 04 Apr 2024 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అనుకూల వైఖరి తీసుకొందన్న విమర్శలకు అమెరికా (USA) విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ అనుకూలం కాదని.. ప్రతి ఒక్కరిని చట్టప్రకారం సమానంగా చూడాలని, మానవ హక్కుల విషయంలోనే మాట్లాడతామని పేర్కొన్నారు. మాథ్యూ మిల్లర్‌ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విషయంలో మాట్లాడతారు గానీ, పాక్‌లో ప్రతిపక్ష నేతల అరెస్టులపై మాత్రం మౌనంగా ఉంటారనే విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు బుధవారం నేరుగా ఆయన వద్దే ప్రస్తావించారు. దీనికి స్పందిస్తూ ‘‘నేను దానిని అంగీకరించను. పాకిస్థాన్‌లో ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారమే చూడాలని, వారి మానవహక్కులను గౌరవించాలని పలు మార్లు చెప్పాము. అదే వైఖరిని ప్రపంచంలోని అన్ని దేశాల విషయంలో అనుసరిస్తాం’’ అని వివరణ ఇచ్చారు. 

మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. ఆ పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ఆశిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ ‘‘ఇది పాత చెడు అలవాటు. దేశాల మధ్య మర్యాద అనేది ఉండాలి. మనవి సార్వభౌమత్వం ఉన్న దేశాలు. మనం ఒకరి అంతర్గత విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. ఒక  దేశ రాజకీయాలపై మరొకరు వ్యాఖ్యలు చేయకూడదు. అందుకే వీటిపై మా అభ్యంతరాలను ఆయా దేశాల దౌత్యవేత్తలకు బలంగా చెప్పాం’’ అని హితవు పలికారు.

పన్నూ హత్యకు కుట్ర కేసులో ఫలితాల కోసం చూస్తున్నాం.. 

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో భారత్‌ అంతర్గత దర్యాప్తు నివేదికపై మిల్లర్‌ స్పందించారు. ఆ వివరాలను తాను వెల్లడించలేనన్నారు. ఇక భారత్‌ వైపు నుంచి జరిగిన దర్యాప్తు ఫలితం కోసం వేచి చూస్తున్నామన్నారు. ‘‘మీడియా రిపోర్టులపై నేను స్పందించను. భారత్‌ను పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరాం. దాని ఫలితాల కోసం చూస్తున్నాం. ఇంతకు మించి మీకు చెప్పేందుకు ఏమీ లేదు’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని