Israel: ఇరాన్‌పై ప్రతిదాడికి సహకరించబోం.. ఇజ్రాయెల్‌కు తేల్చి చెప్పిన అమెరికా!

Israel: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను కొలిక్కి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇరాన్‌ దాడికి ప్రతీకారంగా తిరిగి దాడులు చేయొద్దని ఇజ్రాయెల్‌కు బైడెన్‌ చెప్పినట్లు సమాచారం.

Updated : 15 Apr 2024 08:41 IST

వాషింగ్టన్‌: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ (Iran - Israel) మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతం అట్టుడికింది. ఇరాన్‌ డ్రోన్‌, క్షిపణి దాడులను ఇజ్రాయెల్‌ (Israel) విజయవంతంగా తిప్పికొట్టగలిగింది. అయితే, ఇజ్రాయెల్‌ ఎక్కడ ప్రతిదాడికి పాల్పడుతోందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐరాస, జీ7, భారత్‌ సహా ప్రపంచ దేశాలు ఇరుపక్షాలను సంయమనం పాటించాలని కోరాయి. ఈ తరుణంలో అమెరికా (USA) నుంచి కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరింత ఉద్రిక్తతను నివారించడంలో భాగంగా.. ప్రతిదాడులు చేయొద్దని ఇజ్రాయెల్‌కు (Israel) సూచించింది.

ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా తిప్పికొట్టిన తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో (Benjamin Netanyahu) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్లో మాట్లాడినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘‘ఎట్టిపరిస్థితుల్లోనూ ఇరాన్‌పై దాడికి దిగొద్దు. కాదని.. అలా చేస్తే అమెరికా నుంచి ఎలాంటి సహకారం ఉండబోదు. మెజారిటీ డ్రోన్లు, క్షిపణులను కూల్చడమే ఇజ్రాయెల్‌కు అతిపెద్ద విజయం. టెల్‌ అవీవ్‌కు పెద్దగా నష్టం జరగలేదు. ప్రతిదాడులకు దిగడం అనవసరం’’ అని బైడెన్‌ తన అభిప్రాయాన్ని నెతన్యాహుతో చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోసారి దాడి వల్ల పశ్చిమాసియాలో పరిస్థితులు చేదాటిపోయే ప్రమాదం ఉందని అమెరికా (USA) ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

80కి పైగా యూఏవీలను కూల్చాం..

ఇజ్రాయెల్‌పైకి ఇరాన్‌ (Iran) సంధించిన దాదాపు 80కి పైగా మానవ రహిత విమానాలు (UAVs), ఆరు బాలిస్టిక్‌ క్షిపణులను కూల్చినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ ఆదివారం వెల్లడించింది. ఒక క్షిపణిని లాంఛర్‌పై ఉండగానే ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఏడు యూఏవీలను (UAVs) ప్రయోగించడానికి ముందే హూతీల అధీనంలో ఉన్న యెమెన్‌ భూభాగంపై అడ్డుకున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని