ఆమె బ్యాంకునే మింగేసిన ఆర్థిక అనకొండ..!

వడ్డించేవాడు మనవాడైతే అన్న సామెతను ఓ వియత్నాం మహిళ ఒంటబట్టించుకొంది. ఏకంగా బ్యాంక్‌నే గుప్పిట పెట్టుకొని ప్రజల సొమ్ముతో ఆగ్నేయాసియా చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది. ఇప్పుడు ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది.

Updated : 12 Apr 2024 19:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమె ఓ బిలియనీర్‌.. ఆ మహిళ తెలివితేటలు చూస్తే ఎంతటి ఆర్థిక నిపుణుడైనా కళ్లు తేలేయాల్సిందే.. ప్రజల సొమ్మును కొట్టేసేందుకు ఓ బ్యాంకుపై అక్రమ మార్గాల్లో నియంత్రణ సాధించింది. ఇంకేముంది.. తప్పుడు రుణపత్రాలను సమర్పించడం.. డబ్బు డ్రా చేసుకోవడం. ఈరకంగా ఆ దేశ జీడీపీలో ఏకంగా 3 శాతానికి సమానమైన మొత్తాన్ని స్కాం చేసి దాదాపు బ్యాంకు సొమ్ము మొత్తం మింగేసింది. కానీ, కాలం కలిసిరాక నేరం బయటపడటంతో ఇప్పుడు అక్కడి న్యాయస్థానం మరణశిక్షను విధించింది. ఆమె పేరు ట్రూంగ్‌ మై లాన్‌. వియత్నాంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. 

ట్రూంగ్‌ కుటుంబానికి వియత్నాంలోనే అతిపెద్ద రియల్‌ఎస్టేట్‌ సంస్థల్లో ఒకటైన వాన్‌ థిన్‌ ఫాట్‌ గ్రూప్‌ అనే సంస్థ ఉంది. వాస్తవానికి చైనా-వియత్నాం జాతీయురాలైన ట్రూంగ్‌ తొలుత తల్లితో కలిసి కాస్మొటిక్స్ వ్యాపారం చేసింది. కానీ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం డోయ్‌మోయ్‌ పేరిట 1986లో సంస్కరణలు చేపట్టింది. దీంతో 1990 నుంచి ఆమె మెల్లగా భూములు, హోటళ్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అక్కడ భూములు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడానికి అధికారులతో మంచి సంబంధాలు కలిగిఉండాలి. ట్రూంగ్‌ ఈ మార్గంలో వేగంగా ఎదిగి.. 2011 నాటికి దేశంలోని సంపన్నుల్లో ఆమె ఒకరిగా నిలిచింది.

బినామీలతో బ్యాంక్‌ కబ్జా..

ఇక అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకు అయిన ‘సైగాన్‌ జాయింట్‌ స్టాక్‌ కమర్షియల్‌ బ్యాంక్‌’(ఎస్‌సీబీ)ను 2012 నుంచి 2022 వరకు నియంత్రించింది. వాస్తవానికి ట్రూంగ్‌ ఆధీనంలోని మూడు బ్యాంకులు దివాలా తీయగా.. వాటిని విలీనం చేసి ఎస్‌సీబీని ఏర్పాటుచేసింది. ఇక్కడే మతలబు ఉంది. ఆ దేశ చట్టాల ప్రకారం ఏ వ్యక్తికి బ్యాంక్‌లో 5 శాతానికి మించి వాటా ఉండకూడదు. దీంతో ట్రూంగ్‌ వందల కొద్దీ షెల్‌ కంపెనీలను ఏర్పాటుచేసుకొంది. డజన్ల కొద్దీ బినామీలను పెట్టుకొని బ్యాంక్‌లో 90శాతం వాటాలను వారి ద్వారా దక్కించుకొని అంతా తన గుప్పిట్లో ఉంచుకొంది. 

తప్పుడు రుణ పత్రాలు సృష్టించి..

2012 నుంచి 2017 వరకు 368 రుణాలు ఎస్‌సీబీ నుంచి ట్రూంగ్‌ సూచనల మేరకు జారీ అయ్యాయి. ఆ తర్వాత 2018 నుంచి 2022 వరకు మరో 916 తప్పుడు పత్రాలతో దాదాపు 12.5 బిలియన్‌ డాలర్లను ఆమె దారి మళ్లించింది. బ్యాంకు ఇచ్చిన మొత్తం అప్పుల్లో ఇది 93 శాతానికి సమానం. 2019-22 మధ్యలో తన డ్రైవర్‌తోనే దాదాపు 4 బిలియన్‌ డాలర్లను విత్‌డ్రా చేయించింది. రెండు టన్నుల బరువున్న ఆ మొత్తం నగదును తన ఇంటి బేస్‌మెంట్‌లో భద్రపర్చింది. ఈ క్రమంలో అధికారులకు ఇష్టమొచ్చినట్లు లంచాలు ఇచ్చింది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ వియత్నాం చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌కు 5.3 మిలియన్‌ డాలర్లు ముట్టజెప్పింది. ఆమె అవినీతి సొమ్ము దేశ జీడీపీలో 3 శాతానికి సమానమని నిపుణులు చెబుతున్నారు.  

2022లో జాతీయస్థాయిలో అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలుపెట్టడంతో ఈమె కుంభకోణం బయటపడింది. అదే ఏడాది అక్టోబర్‌లో ట్రూంగ్‌ సహా మరో 80 మందిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె మొత్తం 44 బిలియన్‌ డాలర్ల (రూ.3.6 లక్షల కోట్లు) స్కామ్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఆగ్నేయాసియాలోనే ఇది అతిపెద్ద స్కాం. 2,700 మంది సాక్షులు, పది రాష్ట్రాల ప్రాసిక్యూటర్లు, 200 మంది లాయర్లు ఈ కేసు విచారణలో పాల్గొన్నారు. దాదాపు ఆరు టన్నుల బరువైన 104 బాక్సుల పత్రాలను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. 1,000 ఆస్తులను స్వాధీనం చేసుకొన్నారు. ట్రూంగ్‌కు ఇప్పుడు న్యాయస్థానం మరణదండన విధించింది. తీర్పు ప్రకారం ఆమె 27 బిలియన్‌ డాలర్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అవి ఎప్పటికీ రాకపోవచ్చని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు