US Presidential Debate: వివేక్‌ ఆరోపణలు.. మౌనంగా ఉండిపోయిన నిక్కీ హేలీ

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లిన్‌ పార్టీ తరపున పోటీ పడుతున్న అభ్యర్థుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం యూనివర్శిటీ ఆఫ్‌ అలబామాలో జరిగింది. 

Updated : 07 Dec 2023 14:14 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం (Republican Presidential Debate) కోసం జరిగిన నాలుగో విడత చర్చా కార్యక్రమం వాడీవేడిగా జరిగింది. దీనిలో నలుగురు అభ్యర్థులూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ చర్చలో భారత సంతతి వ్యక్తులు నిక్కీ హేలీ ( Nikki Haley), వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy)తోపాటు ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డి శాంటిస్‌ (Ron DeSantis), న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ (Chris Christie) పాల్గొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఈ సారి కూడా చర్చకు డుమ్మా కొట్టి, నిధుల సమీకరణ కోసం ఫ్లోరిడాలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. 

యూనివర్శిటి ఆఫ్‌ అలబామాలోని మూడీ మ్యూజిక్‌ హాలులో జరిగిన చర్చలో నిక్కీ హేలీనే లక్ష్యంగా వివేక్‌ రామస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె అవినీతిపరురాలని, మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థల నుంచి నిధులు తీసుకుని ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. డెమోక్రటిక్‌ పార్టీకి విరాళాలు ఇచ్చే రీడ్‌ హోఫ్మన్‌ (Reid Hoffman) అనే బిలియనీర్‌ నుంచి నిక్కీ, ఆమె కుటుంబం 2.5 లక్షల డాలర్లు లబ్ధి పొందారని వివేక్‌ ఆరోపించారు. గత మూడు చర్చా కార్యక్రమాల్లో వివేక్‌కు దీటుగా బదులిచ్చిన నిక్కీ .. ఈ విడత చర్చలో చాలాసేపు మౌనంగానే ఉండిపోయారు. ఒక దశలో ఆమెకు మద్దతుగా మరో అభ్యర్థి క్రిస్‌ క్రిస్టీ వివేక్‌పై విరుచుకుపడ్డారు.

అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురి మృతి

వివేక్‌ ఆడంబరం కోసం మాట్లాడే వ్యక్తని, ఉక్రెయిన్‌పై రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారని క్రిస్‌ విమర్శించారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాన్ని వదిలేయడమే యుద్ధానికి పరిష్కారమని వివేక్‌ గతంలో చెప్పినట్లు ఆరోపించారు. వీటిని అక్కడే ఉన్న వివేక్‌ ఖండించారు. తాను ఎక్కడా అలా చెప్పలేదని అన్నారు. గత మూడు డిబేట్లలో వివేక్‌-నిక్కీ మధ్య వాడీ వేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దఫా చర్చలో నిక్కీ సహా క్రిస్‌, రాన్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు ట్రంప్‌ చర్చలో పాల్గొనకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వారిలో మిగిలిన నలుగురు తనకు సమఉజ్జీలు కాదని ట్రంప్‌ భావిస్తున్నారని, అందుకే ఆయన చర్చలో పాల్గొనడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 60 శాతం రిపబ్లికన్‌ ఓటర్ల మద్దతుతో డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ రేసులో అగ్రగామిగా నిలుస్తున్నారు. అధ్యక్షుడిగా పార్టీ నామినేషన్‌ తనకే లభిస్తుందంటూ ఆయన మొదటి నుంచీ అభ్యర్థుల చర్చల్లో పాల్గొనడం లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని