Vivek Ramaswamy: ఉక్రెయిన్‌పై వ్యాఖ్యలు.. వివేక్‌ రామస్వామి కాన్వాయ్‌ను ఢీ కొట్టిన నిరసనకారులు

అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న నిధుల విషయంలో వివేక్‌ రామస్వామి చేసిన వ్యాఖలకు నిరసనగా కొందరు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Updated : 06 Oct 2023 15:23 IST

వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ (Republican) అభ్యర్థిత్వ పోటీదారు వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) వైఖరిని నిరసిస్తూ కొందరు దాడికి యత్నించారు. కొందరు నిరసనకారులు తన కాన్వాయ్‌లోని వాహనంపై దాడి చేసేందుకు ప్రయత్నించారని వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) ఆరోపించారు. అయోవాలోని గ్రిన్నెల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, వివేక్‌ రామస్వామి ఆరోపణలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. 

‘‘ఈ రోజు ఇద్దరు నిరసకారులతో వాగ్వాదం జరిగింది. వారికి నేను ఎంతో ఓపిగ్గా సమాధానలు చెప్పాను. కానీ, వారిలో ఇద్దరు నీలి రంగు హోండా సివిక్‌ కారుతో నా కాన్వాయ్‌లోని ఎస్‌యూవీని ఢీ కొట్టారు. అనంతరం మా సిబ్బందికి అసభ్య సంజ్ఞలు చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కారుతో ఢీ కొట్టిన వాళ్లు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు’’ అని వివేక్‌ రామస్వామి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాలు తెలిపే హక్కు ఉంటుందని, అందుకు ఇది సరైన విధానం కాదని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వివేక్‌ రామస్వామి నిరసనకారులతో మాట్లాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

నేనొస్తే ఉక్రెయిన్‌కు నిధుల్లో కోత

అంతకముందు ప్రచారంలో భాగంగా వివేక్‌ రామస్వామి మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఉక్రెయిన్‌కు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ మద్దతుదారులు నిరసన తెలిపారు. మరోవైపు ఇలాంటి దాడులతో తనను అడ్డుకోలేరని, తన వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని వివేక్‌ వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు