Lok Sabha results: మోదీ హ్యాట్రిక్‌.. విదేశీ మీడియా ఎలా స్పందించిందంటే!

భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సరళిని ఆసక్తిగా పరిశీలించిన అంతర్జాతీయ మీడియా.. ఫలితాల నేపథ్యంలో స్పందించింది.

Updated : 05 Jun 2024 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలపై ఈసారి అంతర్జాతీయ మీడియా ప్రధానంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. వేగంగా ఆర్థిక వృద్ధి, అనేక అంశాలపై అంతర్జాతీయ వేదికపై తన గళాన్ని బలంగా వినిపించడం, సంక్షోభాల వేళ వేగంగా స్పందించడం వంటి చర్యలతో భారత్‌ చురుకుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడి ఎన్నికల సరళిని ఆసక్తిగా పరిశీలించిన అంతర్జాతీయ మీడియా.. ఫలితాలపై స్పందించింది.

  • లోక్‌సభ ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యం సాధించనప్పటికీ.. ప్రధాని మోదీ మూడోసారి అధికారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అమెరికా మీడియా సంస్థ ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనం పేర్కొంది. మోదీ ప్రభంజనానికి బ్రేకులు పడ్డాయని న్యూయార్క్‌ టైమ్స్‌ అభిప్రాయపడింది.
  • సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మోదీని, ఆయన పార్టీని షాక్‌కు గురిచేశాయని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సాధించలేక పోయారని తన కథనంలో విశ్లేషించింది. వాషింగ్టన్‌ పోస్టు కూడా ఈ తరహాలోనే స్పందించింది.
  • లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మెజార్టీ కోల్పోయారని బ్రిటన్‌ మీడియా సంస్థ ‘ది గార్డియన్‌’ అభిప్రాయపడింది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది.
  • తాజా ఎన్నికలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశ్చర్యకరమైన ఫలితాలను మిగిల్చాయని జర్మన్‌ పత్రిక ‘డీడబ్ల్యూ’ పేర్కొంది. ఈ ఎన్నికల్లో భాజపా స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయిందని పేర్కొంది.
  • మోదీకి మిత్రపక్షాల అవసరం వచ్చిందంటూ రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందని ప్రస్తావించింది.
  • లోక్‌సభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌ పత్రిక ‘డాన్‌’ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ మార్కును దాటలేక పోయినప్పటికీ మూడోసారి అధికారంలో కొనసాగడానికి మోదీ సిద్ధమయ్యారని జియో టీవీ అభిప్రాయపడింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు