Flight Turbulence: బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!

విమానాలకు కనిపించని ఓ శత్రువు గాల్లో పొంచి ఉంటుంది. ఒక్కసారి దాని సమీపంలోకి లోహవిహంగం చేరితే తీవ్రమైన కుదుపులతో అల్లకల్లోలం చేస్తుంది. ఇటీవల సింగపుర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకొంది. అదేంటో చూద్దాం.. 

Updated : 23 May 2024 10:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణిస్తుంటే.. గాల్లో తేలినట్లుందని అంటుంటాం. కానీ, గతుకుల రోడ్లకు మించి కుదుపులు గాల్లోనే సంభవిస్తాయన్న విషయం తెలుసుకోవాలి. వీటి దెబ్బకు ఒక్కోసారి ప్రయాణికుల ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా సింగపుర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇలానే కుదుపులకు లోనై ఓ ప్రయాణికుడు మరణించగా.. 30 మందికి పైగా గాయపడటం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అసలు విమానాలు గాల్లో ఉన్నవేళ ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ మొదలైంది. 

అసలేమిటీ ఎయిర్‌ టర్బులెన్స్‌..

అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్నే ఎయిర్‌ టర్బులెన్స్‌ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకొంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ, క్యుములోనింబస్‌ తుపాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి. 

విమానాలకు ముఖ్యంగా ‘క్లియర్‌ ఎయిర్‌’ టర్బులెన్స్‌ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్‌ స్ట్రీమ్‌ల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరితలానికి 40 వేల నుంచి 60 వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకొంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్‌ స్ట్రీమ్‌లు ఉన్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్‌లో విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపుర్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకొంది. 35వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇటువంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి. వీటిని తప్పించుకొని విమానాలు ప్రయాణించడం దాదాపు అసాధ్యం.

ఇవి ప్రమాదకరమేనా..

సాధారణంగా విమానాలను దారుణమైన టర్బులెన్స్‌లను తట్టుకొనేలా నిర్మిస్తారు. అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకొంటారు. అవసరమైతే విమానాన్ని నెమ్మదింపజేయడం వంటివి చేస్తుంటారు. వీటిల్లో చిక్కుకున్న వేళ ప్రయాణికులను సీటు బెల్టు పెట్టుకోవాలని అప్రమత్తం చేస్తుంటారు. వీటిని పాటించని వారు క్యాబిన్‌లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటుచేసుకొంటుంది. అమెరికాలోని విమానయాన సంస్థలు 2009-2022 మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం 163 మాత్రమే చూసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా గత పదేళ్లలో ఈ పరిస్థితులు 55శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

  •  అమెరికాలో ఎఫ్‌ఏఏ, వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్‌ పరిస్థితులకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి. దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్‌ చేసుకొంటారు.
  • ఈ టర్బులెన్స్‌ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల, దెబ్బతినడం వంటివి అధికంగా చోటు చేసుకొంటాయి. ఒక్క అమెరికాలోని వైమానిక రంగం ఏటా 150-200 మిలియన్‌ డాలర్లను వీటి కారణంగా వెచ్చించాల్సి వస్తోంది.
  •  విమానాల్లో సీటు బెల్టులను ధరించని వారే ఈ టర్బులెన్స్‌ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డ్‌  చెబుతోంది.
  •  టర్బలి అనే వెబ్‌సైట్‌ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,50,000 వైమానిక మార్గాలను అధ్యయనం చేసింది. శాంటియాగో, చిలీ, విరు(బొలివియా) మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్‌లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది.
  • ఇక కజకిస్థాన్‌లోని అల్మాటి నుంచి కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌ మధ్య గగనతల మార్గం రెండో స్థానంలో ఉంది. నాష్‌వెల్లి(టెన్నిసి) - దుర్హమ్‌ (ఉత్తర కరోలినా) మార్గం తృతీయ స్థానంలో నిలిచింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు