Iran: రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?

ఇరాన్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆ దేశాధ్యక్షుడి ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా దేశ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై చర్చ మొదలైంది.  

Published : 20 May 2024 10:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌ (Iran) సుప్రీం లీడర్‌ ఖమేనీ వారసుడిగా పేరు తెచ్చుకొన్న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడం ఆ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేయనుంది. ప్రమాదానికి గురైన లోహవిహంగంలో ఎవరూ బతికిఉన్న ఆనవాళ్లు లేవని సహాయక బృందాలు ప్రకటించాయి. ఆయన మరణించినట్లు వార్తలొస్తున్నాయి.  దీంతో ఇరాన్‌ ఈ అంశంపై అధికారిక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రైసీ తర్వాత ఎవరు ఆ పదవి చేపడతారనే చర్చ మొదలైంది. 

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్‌ 131లో ఈ విషయం ఉంది. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్‌ ఖమేనీ ఆమోద ముద్ర అవసరం. 

అనంతరం ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పార్లమెంట్ స్పీకర్‌, న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. 

రైసీ వయసు 63 ఏళ్లు. 2017లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్‌ రౌహానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో అమెరికా ట్రెజరీ విభాగం రైసీపై ఆంక్షలు విధించింది. ఖమేనీ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసినందుకు ఈ నిర్ణయం తీసుకొంది. 2021లో జరిగిన ఎన్నికల్లో రైసీ అధ్యక్షుడిగా  గెలిచారు. అప్పట్లో ఆయన ఎన్నిక కోసం చాలా మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత దేశంలో ఆయన పరపతి గణనీయంగా పెరిగింది. ఖమేనీ వారసత్వాన్ని అందుకొంటారనే ప్రచారం కూడా బలంగా జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని