Gaza: గాజా నరకప్రాయంగా మారింది.. WHO చీఫ్‌ భావోద్వేగం!

Gaza: గాజాలో ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేసుకుంటూ WHO డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 26 Jan 2024 09:02 IST

జెనీవా: ఇజ్రాయెల్‌- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ అన్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ పాలక మండలి సమావేశంలో గురువారం ఆయన అన్నారు.

ఇథియోపియాకు చెందిన టెడ్రోస్‌ (Tedros Adhanom Ghebreyesus) చిన్నతనంలో స్వయంగా యుద్ధ పరిణామాలను చవిచూశారు. 1998-2000 మధ్య ఎరిత్రియాతో సరిహద్దు యుద్ధ సమయంలో ఆయన పిల్లలూ బంకర్లలో తలదాచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాజాలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ఘర్షణలు, ద్వేషం, ఆవేదన, విధ్వంసం తప్ప.. యుద్ధం ఎలాంటి పరిష్కారం ఇవ్వదని నా సొంత అనుభవంతో చెబుతున్నా. అందుకే శాంతియుతంగా, రాజకీయంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుందాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే గాజాలో ఆకలి, వ్యాధులతో మరింత మంది చనిపోతారు’’ అని టెడ్రోస్‌ అన్నారు.

టెడ్రోస్‌ వ్యాఖ్యలు నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమని ఐరాసలోని ఇజ్రాయెల్‌ (Israel) రాయబారి మీరవ్ ఐలాన్ షహర్ దుయ్యబట్టారు. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ దాడి చేసినప్పటి నుంచి డబ్ల్యూహెచ్‌ఓ వైఖరి భిన్నంగా ఉందని విమర్శించారు. ఇజ్రాయెల్‌లో సామాన్యులపై దాడి, మహిళలపై అత్యాచారాలు, బందీలు, ఆస్పత్రులను మిలిటరీ కేంద్రాలుగా మార్చుకోవటం వంటి వాటిని అసలు ప్రస్తావించడం లేదని అన్నారు. హమాస్‌తో ‘‘కుమ్మక్కవ్వడం’’ వల్లే WHOకు ఇవేవీ కనిపించడం లేదని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని