Covid 19: మరో ప్రాణాంతక మహమ్మారికి సిద్ధం కావాల్సిందే : WHO హెచ్చరిక

కొవిడ్‌-19 ప్రపంచ అత్యయిక ఆరోగ్యస్థితి కాదని ప్రకటించినప్పటికీ ఆ మహమ్మారి ముగిసిపోయినట్లు కాదని.. ఇంతకంటే ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేసింది.

Updated : 24 May 2023 22:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ (Covid 19) రూపంలో వచ్చిన మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని వణికించింది. మూడేళ్లైనప్పటికీ ఆ ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలో కరోనా కంటే ప్రాణాంతక మహమ్మారిని (Next Pandemic) ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. తదుపరి వచ్చే మహమ్మారి కొవిడ్‌-19 కంటే మరింత ప్రాణాంతకంగా ఉండవచ్చని అభిప్రాయపడింది.

‘మూడేళ్లనుంచి మన ప్రపంచాన్ని కరోనా మహమ్మారి తలకిందులు చేసింది. ఇప్పటివరకు సుమారు 70లక్షల మరణాలు నమోదయ్యాయి. కానీ, ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని మనకు తెలుసు. కొవిడ్‌-19 ప్రపంచ అత్యయిక ఆరోగ్యస్థితి కాదని ప్రకటించినప్పటికీ ఆ మహమ్మారి ముగిసిపోయినట్లు కాదు. వ్యాధి వ్యాపించేందుకు కారణమయ్యే మరో వేరియంట్‌ రావచ్చు. మరణాలు కూడా సంభవించవచ్చు. మరింత ప్రాణాంతకమైన వైరస్‌ ఉద్భవించే ముప్పు ఉంది’ అని 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. మరిన్ని సంక్షోభాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. తదుపరి మహమ్మారి తలుపుతట్టిన వెంటనే నిర్ణయాత్మకంగా, సమిష్ఠిగా, సమానంగా తక్షణమే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడిన టెడ్రోస్‌.. తదుపరి మహమ్మారిని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు ఇదే సరైన సమయమన్నారు. ప్రజారోగ్యానికి తొమ్మిది వ్యాధులు అత్యంత ప్రమాదకరంగా మారాయన్న డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌.. చికిత్స లేకపోవడం లేదా మహమ్మారికి దారితీసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఇవి ప్రమాదకరమైనవిగా మారినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని