Bird Flu: బర్డ్‌ఫ్లూ వేరియంట్‌తో తొలి మరణం.. ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్‌వో

Bird Flu: మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి బర్డ్‌ఫ్లూ లక్షణాలతో మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. అయితే, ఆయనకు ముందు నుంచే కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది.

Published : 06 Jun 2024 08:29 IST

Bird Flu | జెనీవా: బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్‌ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని వెల్లడించింది.

తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డయేరియా, వాంతుల వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 59 ఏళ్ల వ్యక్తి ఏప్రిల్ 24న మరణించినట్లు మెక్సికో తమకు సమాచారం అందించినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. పౌల్ట్రీ, జంతువుల వద్దకు బాధితుడు వెళ్లిన ఆధారాలు కూడా లేవని తెలిపింది. అయితే, ఆయనకు మొదటి నుంచే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటి వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చని పేర్కొంది.

ఏవియన్‌ ఫ్లూ లక్షణాలు బయటపడడానికి ముందే బాధితుడు మూడువారాల నుంచి అనారోగ్యంతో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అతడికి వైరస్‌ ఎక్కడి నుంచి సోకిందనేది మాత్రం ఇంకా గుర్తించలేకపోయారు. మెక్సికోలో పౌల్ట్రీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. అయితే అక్కడి నుంచి మనుషులకు సోకే ప్రమాదం చాలా చాలా తక్కువని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. మరోవైపు బర్డ్‌ఫ్లూలోనే మరో వేరియంట్‌ హెచ్‌5ఎన్‌1 అమెరికా డెయిరీల్లో వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న కొంతమందికి ఇది సోకినట్లు నిర్ధరించారు. కానీ, మనిషి నుంచి మనిషికి సోకుతున్నట్లు మాత్రం ఇప్పటి వరకు నిర్ధరణ కాలేదు.

ఇటీవల భారత్‌లో దేశంలోని పక్షులు, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పశుసంవర్థక విభాగంతో పంచుకోవాలని సూచించింది. దీనివల్ల ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రజారోగ్య కార్యాచరణను చేపట్టవచ్చని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని