Ebrahim Raisi: ప్రాసిక్యూటర్‌ టు ప్రెసిడెంట్‌: ఎవరీ ఇబ్రహీం రైసీ..?

ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఎదిగారు. ప్రాసిక్యూటర్‌గా జీవితం మొదలుపెట్టిన ఆయన అధ్యక్ష స్థానానికి చేరుకొన్నారు. 

Published : 20 May 2024 11:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే హమాస్‌ యుద్ధం, సిరియా సంక్షోభం, అణు ఒప్పందం, ఎర్ర సముద్రంలో దాడులు ఇలా పలు కీలక అంశాలు ఏకకాలంలో తెరపైకి వచ్చిన వేళ ఈ ప్రమాదం జరగడం టెహ్రాన్‌కు ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే.. ఆ దేశ వ్యూహాలను నడిపించాల్సిన అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి ఇద్దరూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఎదురు దెబ్బే.

సంప్రదాయ విద్యలో దిట్ట..

రైసీ ఇరాన్‌లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన 15వ ఏట క్వామ్‌లో మత విద్యను అభ్యసించారు. అక్కడే గతంలో ఇరాన్‌లోని ప్రముఖ ముస్లిం స్కాలర్లు కూడా చదువుకొన్నారు.

* ఆయన్ను 20ఏట ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత పలు నగరాల్లో విధులు నిర్వహించారు. డిప్యూటీ ప్రాసిక్యూటర్‌గా రాజధాని టెహ్రాన్‌కు బదిలీ చేశారు. 

* 1983లో జమైలానుమను ఆయన వివాహం చేసుకొన్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

* 1988లో రైసీ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను స్వీకరించారు. రాజకీయ ఖైదీలకు మరణశిక్షలను ఆయన పర్యవేక్షించారు. ఈ పదవితో ఆయన ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు. అమెరికా కూడా ఆయనపై ఆంక్షలు విధించడానికి కారణమైంది. 

* 1989లో ఖొమైనీ మరణం తర్వాత..  టెహ్రాన్‌ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలను అందుకొన్నారు. వారసులుగా వచ్చిన ఖమేనీ నీడలో క్రమంగా ఆయన దేశంలో కీలక పదవులను అందుకొన్నారు. 2016లో మషాద్‌లోని అస్టాన్‌ ఖుద్స్‌ రజావీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.  

* 2015లో ఇరాన్‌ అణుఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్‌ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ, దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు ఆయనకు లభించింది. నాటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు. 2021లో ఆయన కల నెరవేరి.. ఆ ఎన్నికల్లో గెలిచారు. అప్పటికే ట్రంప్‌ అమెరికాను అణుఒప్పందం నుంచి బయటకు తెచ్చేశారు. 

* దివంగత ఖొమైనీ, ప్రస్తుతం సుప్రీం లీడర్‌ ఖమేనీలతో రైసీకి మంచి  సంబంధాలున్నాయి. ఆయన సైన్యం, న్యాయ, పాలన విభాగాలతో అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తారనే పేరుంది. 

* 2022లో మాషా అమిని అనే యువతిపై ఇరాన్‌ మోరల్‌ పోలీసులు దాడి చేసి చంపడంతో రైసీ సర్కారుపై దేశవ్యాప్తంగా తొలిసారి వ్యతిరేకత వచ్చింది. ఈ అల్లర్లలో దాదాపు 500 మంది చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. 

* ఇరాన్‌-ఇజ్రాయెల్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌, హుతీల దుందుడుకు చర్యలు వంటి వివాదాల్లో ఇరాన్‌ వైఖరిని ఆయనే నిర్దేశించారు. దీనికి తోడు సిరియాలో ఇరాన్‌ దౌత్యకార్యాలయంపై దాడికి తీవ్రంగా స్పందించారు. నేరుగా ఇజ్రాయెల్‌పైకి వందల కొద్దీ డ్రోన్లను పంపారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని