Covid-19: వెనక్కి తగ్గేదేలే.. చైనాపై ఒత్తిడి పెంచిన డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణకు చైనా కచ్చితంగా సహకరించాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెండ్రోస్ అన్నారు.

Updated : 17 Sep 2023 20:25 IST

జెనీవా: కరోనా వైరస్‌ (Corona Virus) మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ పునరుద్ఘాటించారు. వైద్యనిపుణుల బృందాన్ని అక్కడికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వూహాన్‌ ల్యాబ్‌ (Wuhan Lab) నుంచే కొవిడ్‌-19 వైరస్‌ బయటకొచ్చిందని ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజనిర్ధారణకు పూర్తి సహకారం అందించాలని చైనాను మరోసారి కోరినట్లు ఓ అంతర్జాతీయ మీడియాకు ఆయన తెలిపారు. చైనాతో ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ప్రపంచ దేశాలు ఈ విషయాన్ని చర్చకు తీసుకురావాలని ఆయన కోరారు. వూహాన్‌ ల్యాబ్‌లో పరిశోధనలకు అనుమతిస్తే, డబ్ల్యూహెచ్‌వో నుంచి బృందాన్ని పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకి ఇప్పటికే లేఖ రాసినట్లు ఆయన గుర్తు చేశారు.

యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన కరోనా వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదు. 2019 చివరిలో చైనాలోని వూహాన్‌ నగరంలో తొలి కేసు నమోదైంది. దీనిపై రెండు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వూహాన్‌లో వైరస్‌లపై పరిశోధన చేసే ల్యాబొరేటరీ నుంచే కొవిడ్‌-19 వైరస్‌ బయటకొచ్చిందని కొందరు చెబుతుంటే.. కొవిడ్‌ సోకిన జంతువు నుంచి మానవులకు వ్యాప్తి చెంది ఉండొచ్చని మరొక వాదన ఉంది. దీనిపై 2021లో డబ్ల్యూహెచ్‌వో ఓ నిజనిర్ధారణ కమిటీని వేసింది. చైనా వైద్య బృందంతో కలిసి పరిశోధనలు చేసిన ఆ కమిటీ.. ఉమ్మడి నివేదికను వెల్లడించింది. వూహాన్‌ మార్కెట్లో ఓ గబ్బిలం నుంచి ఈ వైరస్‌ మానవులకు సోకి ఉండొచ్చని చెప్పింది. మిగతా వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.

దీనిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో నిజనిర్ధారణకు కేవలం డబ్ల్యూహెచ్‌వో బృందాన్ని మాత్రమే అనుమతించాలని డబ్ల్యూహెచ్‌వో పలుమార్లు కోరింది. దీనికి చైనా ఏమాత్రం అంగీకరించడం లేదు. అయినప్పటికీ, తమ దర్యాప్తును విరమించే ప్రసక్తే లేదని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ చెబుతున్నారు. వైరస్‌ మూలాలపై కచ్చితంగా సమాచారం తెలుసుకుంటామని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. అమెరికా లాంటి అగ్రదేశాల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ వూహాన్‌ ల్యాబ్‌లో వైరస్‌ పుట్టుకపై నిజనిర్ధారణ చేసేందుకు చైనా నుంచి ఏమాత్రం మద్దతు లభించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని