WHO: ఆల్కహాల్‌, తీపిపానియాల వాడకాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్‌వో కొత్త సిఫార్సు

ఆల్కహాల్‌, తీపి పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంఖ్య కొత్త సిఫార్సు చేసింది. వీటి ఉత్పత్తులపై అధిక పన్నును విధించాలని ఒక మాన్యువల్‌ను విడుదల చేసింది.   

Published : 06 Dec 2023 02:34 IST

జెనీవా: మారుతున్న జీవనశైలితోపాటు, ఆహారపు ఆలవాట్లతో మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. మద్యపానం(Alcohol), తీపి పానియాల(Sugar Swetened beverages) అలవాటుతో చిన్న వయసులోనే పలువురు రోగాల బారిన పడుతున్నారు. వీటి ప్రభావం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలు మానవాళి ఆరోగ్య సంరక్షణకు ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ అనుకున్న రీతిలో ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో వీటి కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) భిన్న మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఆల్కహాల్‌, తీపి పానియాలపై వాడకంపై ఎక్సైజ్‌ పన్ను(Exice Tax)ను మరింత ఎక్కువ విధించాలని డబ్ల్యూహెచ్‌వో తాజాగా సిఫార్సు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆల్కహాల్‌, షుగర్‌ బేవరేజెస్‌పై తక్కువ సుంకాన్ని విధిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. పలు దేశాల్లో వీటిపై విధిస్తున్న పన్నును పరిశీలించగా చాలా దేశాల్లో తక్కువ విధిస్తున్నారని తమ పరిశోధనలో తేలిందని తెలిపింది. ఆరోగ్య మానవాళిని పెంచేందుకు ఆల్కహాల్‌, తీపిపానియాలపై ఎక్కువ పన్ను వేయడం మెరుగైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. 

దీనికి సంబంధించి తాజాగా డబ్ల్యూహెచ్‌వో ఆల్కహాల్‌ ట్యాక్స్‌ పాలసీ మాన్యువల్‌(alcohol Tax policy)ను విడుదల చేసింది. అధిక పన్నుల(Tax) వల్ల లిక్కర్‌ వాడకాన్ని అరికట్టవచ్చని, తద్వారా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, నేరాలను అదుపులో పెట్టవచ్చని పేర్కొంది. మద్యం విపరీతంగా తాగే అలవాటు ఉన్నవారు మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే దానినే ఎంచుకుంటారని ఒక పరిశోధనలో తేలినట్లు పేర్కొంది. మద్యం వాడకం వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది, అనారోగ్య ఆహార పదార్థాల వల్ల ఏటా 8 లక్షల మంది చనిపోతున్నారని తెలిపింది. ఆల్కహాల్‌, తీపిపానియాలపై ఇప్పుడు విధిస్తున్న సుంకానికి అధనంగా ఎక్కువ మొత్తంలో పన్ను వేయడం వల్ల గణనీయసంఖ్యలో మరణాలను ఆపవచ్చని పేర్కొంది. ఇలా చేయడం వల్ల హానికర ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులను పెంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. తీపిపానియాలపై ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో పన్ను ఉన్నప్పటికీ ఆ ఉత్పత్తిలో సగటున పన్ను 6.6 శాతం ఉంటున్నట్లు తెలిపింది. అనారోగ్యానికి గురిచేసే ఉత్పత్తులపై టాక్స్‌ విధించడం వల్ల అరోగ్యకర జనాభా పెరుగుతుంది. ఇది మన సమాజంపై ఒక సానుకూల ప్రభావాన్ని తీసుకొస్తుంది. తద్వారా వ్యాధులు తగ్గడానికి, ప్రభుత్వాలకు ఆదాయం పెరిగి మరింత సేవ చేసేందుకు ఉపయోగపడుతుంది’’ అని డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ప్రమోషన్‌ డైరెక్టర్‌ రుడిగర్‌ క్రెచ్‌ అన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా 148 దేశాలు ఆల్కహాల్‌ ఉత్పత్తులపై ఒక్కోరకంగా పన్నులు విధిస్తున్నాయని, అయితే వీటిలో 22 దేశాలు వైన్‌పై విధించడం లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అమ్ముడు పోయే ఆల్కహాల్‌ కలిగిన బీర్లపై సగటున 17.2 శాతం, స్పిరిట్‌ ఉత్పత్తులపై 26.5 శాతం పన్ను విధిస్తున్నట్లు తేలినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఆల్కహాల్‌ బేవరేజెస్‌ చాలా సరసమైన ధరలో దొరుకుతుండటంపై డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఐలాన్‌ లీ ఆందోళన వ్యక్తం చేశారు. మద్యంపై అధిక పన్నులు పేద ప్రజలను మరింత ఆర్థిక ఇబ్బందుల్లో నెడుతుందని ఆ పరిశ్రమ వాదిస్తున్నప్పటికీ, బలహీన సామాజిక వర్గాల్లో దీని వాడకం హానికరమని విస్మరిస్తోందని డబ్ల్యూహెచ్‌వో మాన్యువల్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని