ఐఆర్‌జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లహియన్

అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ విదేశాంగ మంత్రిని కోల్పోవడం ఇరాన్‌కు పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. 

Updated : 20 May 2024 12:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌ సైన్యం కంటే దౌత్య బృందం బలంగా శక్తిమంతమైనది. భౌగోళిక రాజకీయాల్లోని వివిధ వివాదాల్లో చిక్కుకొన్న దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై సమర్థించే బాధ్యతను వారే చూసుకొంటారు. ఆ బృందానికి నాయకత్వం వహించడం అంత తేలిక కాదు. ప్రస్తుతం ఇరాన్‌ విదేశాంగ మంత్రి  హొస్సేన్‌ అమీర్‌ అబ్దొల్లహియన్ (Hossein Amir Abdollahian) ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో అధ్యక్షుడితోపాటు ఆయన మరణించడం టెహ్రాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ. 

  • ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్దొల్లహియన్‌ (60) బలమైన సంప్రదాయ నేత. ఆయనకు ఆ దేశ అత్యున్నత దళమైన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ మద్దతుంది. 
  •  1964లో సమ్నన్‌ ప్రావిన్స్‌లోని డామ్‌ఘన్‌లో ఆయన జన్మించారు. అంతర్జాతీయ సంబంధాలపై  ఫ్యాకల్టీ ఆఫ్‌ ది మినిస్ట్రీ ఆఫ్‌ ఫారెన్‌ అఫైర్స్ నుంచి డిగ్రీ చేశారు. టెహ్రాన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇదే అంశంపై మాస్టర్స్‌, డాక్టరేట్‌ అందుకొన్నారు. 1990లో ఇరాక్‌ రాయబార కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆ తర్వాత క్రమంగా ఎదిగిన ఆయన అరబ్‌, ఆఫ్రికన్‌ అఫైర్స్‌ డిప్యూటీ మంత్రిగా పనిచేశారు. బహ్రెయిన్‌లో దౌత్యవేత్తగా విధులు నిర్వహించారు.
  •  ఖుద్స్‌ ఫోర్స్ అధిపతి ఖాసీం సులేమానీతో అబ్దొల్లహియన్‌కు మంచి సంబంధాలున్నాయి. సులేమానీ మరణం వరకు ఆయన ఇరాక్‌, అక్కడి గ్రూపుల సమన్వయం కూడా చూసుకొన్నారు. ‘దౌత్య విభాగం ఖాసీం సులేమానీ’గా ఇరాన్‌ సంప్రదాయ వాదులు ఆయన్ను కీర్తిస్తారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 
  •  ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం సందర్భంగా తక్షణమే స్పందించాల్సిన అంశాలపై అబ్దొల్లహియన్‌ మాట్లాడుతూ తరచూ మీడియాలో కనిపించారు. అంతేకాదు.. పశ్చిమ, అరబ్‌ దేశాల విదేశాంగ మంత్రులను సమన్వయం చేసుకోవడంలో కూడా ఈయనదే కీలక పాత్ర. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని