France: పార్లమెంట్‌ను రద్దు చేసిన మేక్రాన్‌.. స్నాప్‌ ఎలక్షన్స్‌కు రెడీ

రానున్న 20 రోజుల్లో ఫ్రాన్స్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు మేక్రాన్‌ స్నాప్‌ ఎలక్షన్స్‌ (Snap Elections)కు పిలుపునివ్వడమే అందుకు కారణం. 

Updated : 10 Jun 2024 14:50 IST

పారిస్‌: ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌(Emmanuel Macron) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ స్నాప్‌ ఎలక్షన్స్‌(Snap Elections)కు పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఐరోపా యూనియన్ ఎన్నికల్లో విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి సానుకూలత వ్యక్తమైన తరుణంలో మేక్రాన్‌ నుంచి ఈ ప్రకటన వచ్చింది. 

స్నాప్‌ ఎలక్షన్ అంటే..?

గడువు ప్రకారం కాకుండా ముందుగానే నిర్వహించే ఎన్నికలనే స్నాప్ ఎలక్షన్స్‌ అంటారు. ముందస్తు ప్రకటనలు లేకుండానే, పూర్తిస్థాయి పదవీకాలం ముగియకముందే వీటిని నిర్వహించే వీలు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలు అధికార పార్టీలు తమ వ్యూహాల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. తమకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల నుంచి లబ్ధి పొందేందుకు, ఏదైనా ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు దాని పరిష్కారం కోసం ఈ దిశగా అడుగులు వేస్తుంటాయి.

ప్రస్తుతం మేక్రాన్ ప్రకటనకు గతవారం జరిగిన ఐరోపా యూనియన్ ఎన్నికలు కారణం. ఆ ఎన్నికల ఫలితాలు విపక్ష పార్టీ నేషనల్ ర్యాలీకి అనుకూలంగా ఉంటాయని ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. మేక్రాన్ పార్టీ రినైజన్స్‌కు 14.8 శాతం నుంచి 15.2 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొన్నాయి. ప్రతిపక్ష పార్టీకి మాత్రం 32 నుంచి 33 శాతం మధ్య ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. నేషనల్ ర్యాలీ పుంజుకుంటుందన్న గుబులే ఈ ముందస్తు ఎన్నికల పిలుపుకు దోహదం చేసింది. 2027లో తన పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తే.. ఆ పార్టీ మరింత పట్టు సాధిస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో మేక్రాన్ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో నేషనల్ ర్యాలీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ పార్టీ అధ్యక్షుడు జోర్డాన్‌ బార్డెల్లా. ప్రస్తుతం ఆయన వయసు 28 ఏళ్లే కావడం గమనార్హం. ఫ్రెంచ్‌ ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని ఎన్నికల ప్రకటనపై ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ఈ నిర్ణయంతో వచ్చే 20 రోజుల్లో అంటే జూన్ 30న తొలిదశ ఓటింగ్ జరగనుంది. రెండో దఫా జులై 7న ఉండనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని