అత్యాచారాలు చేయాలని రష్యన్లను వారి భార్యలే ప్రోత్సహిస్తున్నారు: జెలెన్‌స్కా ఆవేదన..!

ఉక్రెయిన్‌పై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న రష్యా.. లైంగిక దాడులనే ఆయుధాన్ని ప్రయోగిస్తోందని ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కా ఆరోపించారు. ఇందుకు రష్యన్‌ సైనికుల భార్యలు కూడా ప్రోత్సహిస్తుండటం విచారకరమన్నారు.

Updated : 30 Nov 2022 14:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ దేశంపై సాగిస్తోన్న దండయాత్రలో రష్యా సైనికులు.. లైంగిక దాడులను ఆయుధంగా వాడుకుంటున్నారని ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కా ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాలు చేయడానికి రష్యన్‌ బలగాలను వారి భార్యలే ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు.

యుద్ధాలు, అల్లర్ల సమయంలో లైంగిక హింసను అరికట్టాలన్న అంశంపై లండన్‌ వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సతీమణి జెలెన్‌స్కా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధం పేరుతో తమ దేశంలో రష్యా సైనికులు సాగిస్తున్న అకృత్యాల గురించి ఆమె మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాస్కో సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి దురాక్రమణదారులు తమ దేశంలో బహిరంగంగానే లైంగిక హింసకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు.

‘‘ఒకరిపై ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి లైంగిక హింస అనేది అత్యంత క్రూరమైన మార్గం. యుద్ధాల సమయంలో ఇలాంటివి జరిగినా బాధితులు భయంతో ఆ విషయాలను బయటపెట్టలేరు. ప్రస్తుతం మా దేశంలో వారు(రష్యన్‌ బలగాలు) ప్రయోగిస్తున్న మరో ఆయుధం ఇదే. దీన్ని చాలా క్రమపద్ధతిలో, బహిరంగంగానే ఉపయోగిస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న విషయాన్ని రష్యన్‌ సైనికులు వారి బంధువులు, కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెబుతున్నారు. మరో కఠినమైన వాస్తవం ఏంటంటే.. ఈ దాడులను రష్యన్‌ సైనికుల భార్యలు పోత్సహించడం..! ఉక్రెయిన్‌ మహిళలపై అత్యాచారాలు చేయాలని వారు సైనికులకు చెబుతున్నారు’’ అని జెలెన్‌స్కా వివరించారు. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె కోరారు. ఇలాంటి యుద్ధ నేరాలకు పాల్పడేవారిని గుర్తించి.. శిక్ష విధించడం అత్యంత ఆవశ్యకమని అన్నారు.

ఉక్రెయిన్‌లో ఆ మధ్య పలు నగరాలను తమ అధీనంలోకి తీసుకున్న మాస్కో బలగాలు.. అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని గతంలో వార్తలు వచ్చాయి. చిన్నపిల్లలపైనా సాగిస్తున్న ఈ దారుణాలను ఉక్రెయిన్‌ ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని