ఇంటి అద్దె భరించలేక విమానంలో ఉద్యోగానికి.. అవాక్కయిన నెటిజన్లు

ఇంటి అద్దెలు భరించలేక.. ఓ యువతి మరో రాష్ట్రంలోని ఉద్యోగానికి విమానంలో వెళ్లొస్తోంది. అదేంటీ.. అద్దె కంటే విమానయానం ఖర్చు మరీ అంత తక్కువా? అని ఆలోచిస్తున్నారా? ఆ కథేంటో మీరే చదివేయండి..!

Updated : 19 Jun 2023 16:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖరీదైన ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు అక్కడి ఇంటి అద్దెలు భరించడం చాలా కష్టం. అందుకే, చాలా మంది కష్టమైన సరే.. రెంట్‌ తక్కువగా ఉంటుందని సుదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు వెళ్తుంటారు. బండి మీదో, బస్సులోనే గంటల తరబడి ట్రాఫిక్‌ను దాటుకుంటూ విధులకు చేరుకుంటారు. అయితే, అమెరికా (USA)లో ఓ అమ్మాయి మాత్రం ఇంటి అద్దెలు భరించలేక.. వందల మైళ్లు ప్రయాణం చేస్తోంది. అది కూడా విమానంలో..! వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం..!

సౌత్‌ కరోలినా (South Carolina)లోని కార్లెస్టన్‌ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల సోఫియా సెలెంటానో (Sophia Celentano) యూనివర్శిటీ ఆఫ్‌ వర్జీనియాలో చదువుతోంది. వేసవి సెలవులకు కార్లెస్టన్‌కు వచ్చిన ఆమెకు న్యూజెర్సీలోని ఒగిలివ్‌ హెల్త్‌ అనే అడ్వర్టైజింగ్‌ సంస్థలో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం లభించింది. అయితే న్యూజెర్సీ (New Jersey)లో ఇంటి అద్దెలు చాలా ఎక్కువ. శివారు ప్రాంతాల్లో ఉండాలన్న కనీసం నెలకు 3400 డాలర్లు చెల్లించాలి. అయితే, రెండునెలల తన ఇంటర్న్‌షిప్‌ కాలంలో సోఫియా వారానికి ఒక రోజే ఆఫీసుకు వెళ్లాలట. దీంతో అద్దెలు భరించలేని ఆమె వినూత్న ఆలోచన చేసింది.

కార్లెస్టన్‌ నుంచి సుమారు 700 మైళ్ల దూరంలో ఉన్న న్యూజెర్సీకి వారానికి ఒక రోజు విమానంలో వెళ్తోంది. రెండు నెలల్లో మొత్తంగా 8 రోజులు ఆమె ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా.. అందుకు విమాన టికెట్‌, క్యాబ్‌ ఖర్చులు అంతా కలిపి 2,250 డాలర్లే ఖర్చవుతుందట. న్యూజెర్సీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండటం కంటే.. తన ఇంటి నుంచే వెళ్లడం మంచిదని భావించిన సోఫియా.. విమానప్రయాణం చేస్తోంది. అయితే, ఇందుకోసం తాను తెల్లవారుజాము 3 గంటలకే లేవాల్సి వస్తోందని, రాత్రి పొద్దుపోయాక ఇల్లు చేరుతున్నానని ఆమె చెబుతోంది.

ఈ విషయాన్ని సోఫియా ఇటీవల తన సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఆమె జర్నీ కథ తెలుసుకుని నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం అంత ఇబ్బందులు పడటం అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా.. సోఫియా స్టోరీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు