World Court: రఫాపై ఇజ్రాయెల్‌ సైనిక చర్య.. అంతర్జాతీయ న్యాయస్థానం కీలక ఆదేశాలు

దక్షిణ గాజాలోని రఫా పట్టణంపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది.

Published : 24 May 2024 22:42 IST

ది హేగ్‌: దక్షిణ గాజాలోని (Gaza) పాలస్తీనీయుల పట్ల ఇజ్రాయెల్‌ మారణహోమానికి పాల్పడుతోందంటూ దక్షిణాఫ్రికా (SouthAfrica) చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం (International Court) కీలక తీర్పు వెలువరించింది. రఫా పట్టణంపై సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. పాలస్తీనాలో పరిస్థితులు క్షీణించిపోయాయని, వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఇప్పటికే ఇజ్రాయెల్‌ను ఆదేశించినప్పటికీ.. అవి కార్యరూపం దాల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 ‘‘ఇజ్రాయెల్‌ తక్షణమే సైనిక చర్య నిలిపివేయాలి. రఫా ప్రభుత్వానికి ఆటంకం కలిగేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు’’ అని అంతర్జాతీయ కోర్టు న్యాయమూర్తి నవాఫ్‌ సాలమ్‌ వెల్లడించారు. మొత్తం 15 మంది న్యాయమూర్తుల ప్యానెల్‌ 13-2 మెజార్టీతో తీర్పును వెలువరించింది. మరోవైపు, మానవతా దృక్పథంతో రఫా సమీపంలోని ఈజిప్ట్‌-గాజా సరిహద్దును తెరవాలని ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. దీని పురోగతిపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ప్రపంచ న్యాయస్థానం తీర్పుపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పందించారు. తన పౌరులను రక్షించకుండా, గాజాలో హమాస్‌ ఉగ్రవాదులను నిరోధించకుండా ఈ భూమిపై ఏ శక్తీ తమని ఆపలేదని వ్యాఖ్యానించారు. రఫా నగరంపై ఇజ్రాయెల్‌ ఈ నెల ప్రారంభంలో దాడులు ప్రారంభించింది. ఇక్కడ దాదాపు 2.3 మిలియన్ల మంది జనాభా నివసిస్తుండగా.. ప్రాణభయంతో ఇప్పటికే సగానికిపైగా జనం నగరం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గాజాకు దక్షిణ అంచున రఫా నగరం ఉంది. ఇతర దేశాల నుంచి సాయం పొందేందుకు ఇదే ప్రధానమార్గం. హమాస్‌ను దెబ్బతీయాలంటే రఫా నగరంపై దాడి చేయడం ఉత్తమమని భావించిన ఇజ్రాయెల్‌ గత నెల రోజులుగా దీనిపై దాడులు ముమ్మరం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని