Happiness: అత్యంత సంతోషకరమైన దేశాలివే.. భారత్‌ది ఎన్నో స్థానమంటే..?

World Happiness Report: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను తెలియజేసే నివేదిక విడుదలైంది. దీంట్లో ఎప్పటిలాగే నార్డిక్‌ దేశాలు అగ్రభాగంలో నిలిచాయి.

Updated : 20 Mar 2024 10:33 IST

న్యూయార్క్‌: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో (World Happiness Report) ఫిన్లాండ్‌ మరోసారి అగ్రభాగాన నిలిచింది. ఏడు దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవ’మైన బుధవారం (మార్చి 20న) యూఎన్‌ ఆధారిత సంస్థ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌(1), డెన్మార్క్‌(2), ఐస్‌లాండ్‌(3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి.

ఈ జాబితాలో (World Happiness Report) భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. చైనా (60), నేపాల్‌ (93), పాకిస్థాన్‌ (108), మయన్మార్‌(118) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది.

నివేదికలోని మరికొన్ని కీలకాంశాలు..

  • ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు.
  • దాదాపు దశాబ్దకాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి ఈ ఏడాది కిందకు దిగజారాయి.
  • కోస్టారికా, కువైట్‌ తొలిసారి టాప్‌-20లోకి చేరాయి. వరుసగా 12, 13 స్థానాలు దక్కించుకున్నాయి.
  • తొలి పది దేశాల్లో పెద్ద దేశమేదీ లేదని నివేదిక తెలిపింది. తొలి పదింటిలో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా మాత్రమే. టాప్‌-20లో కెనడా, యూకే మాత్రమే మూడు కోట్ల కంటే అధిక జనాభా ఉన్న దేశాలు.
  • 2006-10 నుంచి అఫ్గానిస్థాన్‌, లెబనాన్‌, జోర్డాన్‌ ప్రజలు సంతోషాన్ని గణనీయంగా కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. సెర్బియా, బల్గేరియా, లాత్వియా వంటి దేశాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.
  • పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు ఈ ఏడాది నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకేరకంగా లేదని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది.
  • మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు వెల్లడించింది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనంద స్థాయులను అనుభవిస్తున్నట్లు తేలింది.
  • సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది.

ఫిన్లాండ్‌ ప్రజల సంతోషానికి ఇవే కారణాలు..

ఫిన్లాండ్‌ ప్రజలు ఆనందంగా ఉండడానికి ప్రకృతితో దగ్గరి సంబంధం, ఆరోగ్యకరమైన వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకురాలు జెన్నిఫర్‌ డీ పావోలా తెలిపారు. ‘జీవితంలో విజయం’ అనే అంశంపై అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన ఉందని పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక ఎదుగుదలను జీవితంలో విజయానికి ముడిపెడతారని.. ఫిన్లాండ్‌లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని వివరించారు. ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ స్థాయిలో అవినీతి, ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలుగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని