Lok Sabha Elections: లోక్‌సభ ఫలితాలపై ఉత్కంఠ.. ప్రపంచం చూపు భారత్‌ వైపు!

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మీడియాతోపాటు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Published : 03 Jun 2024 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక సంగ్రామం పరిణామాలనూ యావత్‌ ప్రపంచం ఆసక్తిగా పరిశీలిస్తోంది. సాధారణంగా ఇక్కడి వ్యవహారాలపై అంత ప్రాధాన్యమివ్వని పాశ్చాత్య మీడియా.. తాజా ఎన్నికలకు మాత్రం భారీ స్థాయిలో కవరేజీ ఇవ్వడం గమనార్హం. ఇండో-పసిఫిక్‌లో దిల్లీ కీలకం కావడం, ప్రపంచ ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతుండటం, అంతర్జాతీయ వేదికలపై తన వాదనలు భారత్‌ బలంగా వినిపించడం వంటివి ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించాయి. దీంతో ఎన్నికల కసరత్తు మొదలు.. ప్రధాన పార్టీల ప్రచారాల తీరు, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ సీఎన్‌ఎన్‌ మొదలు బీబీసీ, ఫ్రాన్స్‌24, అల్‌జజీరా, గ్లోబల్‌ టైమ్స్‌ వంటి అగ్రశ్రేణి మీడియా సంస్థలు పోటాపోటీగా విస్తృత స్థాయిలో కథనాలు ప్రచురించాయి. తుది ఫలితాల కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

సీఎన్‌ఎన్‌ మెగా కవరేజ్‌..

సార్వత్రిక సమరంలో దాదాపు 96 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారని.. ఇది అమెరికా, ఈయూ జనాభా కంటే ఎక్కువని పేర్కొంటూ సీఎన్‌ఎన్‌ ఏప్రిల్‌లోనే కథనాలు మొదలుపెట్టింది. నిరుద్యోగం, సంక్షేమం, మౌలిక సదుపాయాల వంటి సమస్యలను ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ.. అసమానతలూ పెరిగాయని పేర్కొంది. ‘చెరగని సిరా’ పేరుతో పోలింగ్‌ రోజున వేలిపై వేసే గుర్తు, దాని తయారీ రహస్యం వంటి అనేక అంశాలతో ప్రత్యేకంగా ఓ సుదీర్ఘ కథనం రాసింది. ఎన్నికల ప్రచారాల్లో మోదీ చేసిన ప్రసంగాలు.. ముస్లింలపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. వాటిపై విపక్షాల స్పందనలను విశ్లేషించింది. కన్యాకుమారిలోని వివేకానంద స్మారకం వద్ద ప్రధాని మోదీ ధ్యానం చేయడాన్ని ప్రత్యేక స్టోరీగా మలిచింది.

వాషింగ్టన్‌ పోస్టు, న్యూయార్క్‌ టైమ్స్‌..

భారీ స్థాయిలో ఎన్నికల కసరత్తుతోపాటు నిర్వహణ ప్రక్రియలో సవాళ్లపై ‘వాషింగ్టన్‌ పోస్టు’ వరుస కథనాలను ప్రచురించింది. ఆ తర్వాత పొలిటికల్‌ యాడ్స్‌పైనా స్టోరీలు ఇచ్చింది. దేశంలో మహిళలు, యువత సంప్రదాయవాదులు కారని.. వారు ఈసారి ఎటువైపు మొగ్గుచూపనున్నారనే కోణంలోనూ వార్తలు రాసింది. భారత్‌తోపాటు ఐరోపా ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో డీప్‌ఫేక్‌ ఫొటోల వ్యాప్తిపైనా కథనాలు ఇచ్చింది. మోదీ నేతృత్వంలోని కమలదళానికి పశ్చిమ బెంగాల్‌లో లభిస్తోన్న ఆదరణను విశ్లేషించింది. మోదీ బలాలు, విపక్షాల నుంచి అధికార పార్టీకి ఎదురవుతోన్న సవాళ్లు, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీపై ప్రజల్లో అభిప్రాయం, ఎగ్జిట్‌ పోల్స్‌ వంటి వరుస కథనాలను ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కవర్‌ చేసింది.

బ్రిటిష్‌ మీడియా..

లోక్‌సభ ఎన్నికలు భారత్‌కే కాకుండా ప్రపంచానికీ కీలకమని ‘బీబీసీ’ తన కథనాల్లో పలు మార్లు పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుగా ఉన్న భారత్‌తో  కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నట్లు పేర్కొంది. అరెస్టులు, ఆరోపణలు, కృత్రిమ మేధ ప్రభావాలు, ప్రచారం తీరుపై బ్రిటిష్‌ మీడియా అనేక కథనాలు ఇచ్చింది. మోదీ పాపులరిటీ వెనక అమిత్‌ షా నిశ్శబ్ద వ్యూహాలు.. సంక్షేమ పథకాలు, భారత ఆర్థిక వ్యవస్థ మంచీచెడులు, ఓటర్లపై ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రభావం వంటి కథనాలకు ప్రాధాన్యం ఇచ్చింది. మహిళలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చారని ‘ది గార్డియన్‌’ పేర్కొంది.

హిందూవాదం - ఫ్రెంచ్‌24 

దశాబ్ది పాటు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ పాలనకు తాజా ఎన్నికలు రెఫరెండంగానే భావించవచ్చని ఫ్రెంచ్‌ మీడియా సంస్థ ఫ్రాన్స్‌24 తన కథనంలో అభివర్ణించింది. రామ మందిర నిర్మాణం, హిందుత్వ వాదం, ముస్లింలపై మోదీ వ్యాఖ్యలను ప్రస్తావించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను ఉటంకిస్తూ.. మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు పేర్కొంది.

మోదీ మ్యాజిక్‌ - అల్‌జజీరా

పెరుగుతోన్న అసమానతలు, రికార్డు స్థాయి నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉన్నప్పటికీ.. 2019 ఫలితాలతో పోలిస్తే ఈసారి భాజపా మరింత మెరుగైన పనితీరు కనబరచనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయని అల్‌జజీరా పేర్కొంది. అంతకుముందు.. దేశంలో ముస్లిమ్‌ల అణచివేతపై కథనాలు రాసింది. అయినప్పటికీ.. ప్రతిసారి సంఖ్యా బలాన్ని పెంచుకుంటూ హ్యాట్రిక్‌కు దగ్గరయ్యారని తెలిపింది. ఈ ఎన్నికల్లో భాజపా విజయానికి కారణాల వెనక ‘మోదీ మ్యాజిక్‌’ ఉందంటూ కథనాలు రాసింది.

వివాదాల చైనా.. 

సరిహద్దు వివాదాలు కొనసాగుతోన్న వేళ.. భారత్‌లో ఎన్నికలపై చైనా మీడియా ప్రధానంగా దృష్టి సారించింది. ప్రచారంలో బీజింగ్‌పై వ్యతిరేక ప్రకటనలకు దూరంగా ఉండాలంటూ హితవు పలికింది. భారత్‌ తమ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానం అంటూనే.. పొరుగు దేశ చర్యలు తమ సంస్థలను అసంతృప్తికి గురిచేశాయని పేర్కొంది. ప్రధాని మోదీ ఇటీవల అరుణాచల్‌లో పర్యటించడాన్ని తప్పుపట్టింది. దాన్ని ఎప్పటికీ భారత్‌ భూభాగంగా గుర్తించబోమని పాత పాటను పాడింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పక్షం అటువంటి చర్యలకు దిగుతోందని విమర్శించింది. 

పాకిస్థాన్‌ వ్యాఖ్యలు..

లోక్‌సభ ఎన్నికల వేళ పాకిస్థాన్‌ నేతల వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భాజపా-ఆర్‌ఎస్‌ఎస్‌ ఓడిపోవాలని ప్రతి పాకిస్థానీ అకాంక్షిస్తున్నట్లు అక్కడ మాజీ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందు అధికార పార్టీని విమర్శిస్తూ రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగాన్ని రీట్వీట్‌ చేయడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ను పాకిస్థాన్‌ నేతలు కీర్తిస్తున్నారంటూ భాజపా విరుచుకుపడింది.

అమెరికా మీడియాపై రష్యా మండిపాటు

భారత్‌లో ఎన్నికలపై అటు రష్యా కూడా పలు సందర్భాల్లో స్పందించింది. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేసేందుకు అమెరికా ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించింది. భారత జాతీయ మనస్తత్వం, ఆ దేశ చరిత్రపై అమెరికాకు అవగాహన లేదంటూ మండిపడింది. ముఖ్యంగా ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూను హతమార్చేందుకు కుట్ర జరిగిందంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ రాసిన కథనంపై మాస్కో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

పాశ్చాత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్‌..

భారత ఎన్నికలపై పాశ్చాత్య మీడియా నెగెటివ్‌ కవరేజీని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తిప్పికొట్టారు. భారత్‌పై తమ ప్రభావం చూపాలని వారు అనుకుంటున్నారని, అది కొత్తేమీ కాదని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల కోసం కోర్టు మెట్లెక్కిన దేశాలు.. వాటిని ఎలా నిర్వహించాలనే జ్ఞానాన్ని తమకు నేర్పిస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అదో మైండ్‌ గేమ్‌ అన్నారు.

ఇలా సార్వత్రిక ఎన్నికలు కొనసాగిన సమయంలో అంతర్జాతీయ మీడియా దృష్టి మొత్తం భారత్‌పైనా కొనసాగింది. మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితాల కోసం ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని