Sodium: అధిక ఉప్పు ముప్పే.. ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిక

అధిక మోతాదులో ఉప్పు (Salt)ను తీసుకోవడం హృదయ సంబంధ వ్యాధులతోపాటు(Heart Diseases) మరణాలకూ దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

Published : 10 Mar 2023 22:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వినియోగం గణనీయంగా పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార పదార్థాల ద్వారా సోడియం(Sodium) తీసుకునే మోతాదును 2025 నాటికి 30 శాతం తగ్గించాలని పెట్టుకున్న లక్ష్యానికి చాలా దేశాలు ఎంతో దూరంగా ఉన్నాయని పేర్కొంది. ఇలా అధిక మోతాదులో ఉప్పును తీసుకోవడం హృదయ సంబంధిత వ్యాధులతోపాటు మరణాలకూ దారితీస్తుందని హెచ్చరించింది. అధిక మోతాదులో సోడియం వాడటం హృద్రోగ (Heart Diseases), మూత్రపిండాల వ్యాధులు, ఊబకాయం (Obesity), గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌, స్ట్రోక్‌, అకాల మరణాలకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

  • శరీరానికి అవసరమైన సోడియం మనకు ఉప్పు (Salt) నుంచి లభిస్తుంది. దీంతోపాటు కొన్ని సహజ ఆహార పదార్థాల్లోనూ సోడియం గ్లుటామేట్ రూపంలో దొరుకుతుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రపంచ సగటు ఉప్పు వినియోగం రోజుకు 10.8 గ్రాములుగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు కంటే ఇది రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం.
  • డబ్ల్యూహెచ్‌వో సభ్య దేశాల్లో కేవలం 5 శాతం మాత్రమే తప్పనిసరి, సమగ్ర సోడియం తగ్గింపు విధానాలను అమలు చేస్తున్నాయని, 73 శాతం సభ్యదేశాలు అటువంటి విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని నివేదికలో తేలింది. ‘భారత్‌లో ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్‌పై తప్పనిసరి సోడియం డిక్లరేషన్‌ నిబంధన ఉంది. ఇతర తప్పనిసరి చర్యలు ఏమీ లేవు’ అని పేర్కొంది. అయితే, సోడియం తగ్గింపు విధానాలను అమలు చేయడం వల్ల 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చని నివేదిక పేర్కొంది.
  • ‘అనారోగ్యకర ఆహార అలవాట్లు ప్రపంచవ్యాప్తంగా మరణాలు, వ్యాధులకు ప్రధాన కారణం. సోడియం అధికంగా తీసుకోవడం కూడా ఇందులో ఒకటి’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. ‘అనేక దేశాలు ఇంకా ఎటువంటి తప్పనిసరి సోడియం తగ్గింపు విధానాలను అవలంబించలేదని ఈ నివేదిక చెబుతోంది. ఫలితంగా అక్కడి ప్రజలకు గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పొంచి ఉంది’ అని టెడ్రోస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని