Suicidal Thoughts: ఆత్మహత్య ఆలోచనలు ‘ఆ నెల’లోనే ఎక్కువట..!

 బలవన్మరణానికి పాల్పడాలనే ఆలోచనలు ఎక్కువగా డిసెంబర్‌ నెలలోనే అధికంగా వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్‌, కెనడా ప్రజల్లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

Published : 13 May 2023 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వ్యక్తిగత, ఇతర కారణాల వల్ల క్షణికావేశంలో ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఇలా ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచనలు (Suicidal Thoughts) ప్రత్యేకమైన సందర్భాల్లోనే ఎక్కువగా వస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. రోజూ ఉదయం వేళతోపాటు అత్యధికంగా డిసెంబర్‌ నెలలోనే ఈ తరహా ఆలోచనలు ఎక్కువగా వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్‌, కెనడా ప్రజల్లో జరిపిన అధ్యయనంలో తేలింది.

ఆత్మహత్య ఆలోచనలు.. సంవత్సరంలో ఏ నెలలో ఎక్కువగా వస్తాయి? ఏ సమయంలో ఎక్కువగా వస్తాయి? అనే విషయాలను గుర్తించేందుకు నెదర్లాండ్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌డామ్‌, అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హమ్‌ స్కూల్‌ ఆఫ్‌ సైకాలజీలు సంయుక్త పరిశోధనలు చేపట్టాయి. వీటికి సంబంధించిన ఫలితాలు నేచర్‌ ట్రాన్స్‌లేషనల్‌ సైకియాట్రి జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఆలోచన విధానం ఏయే సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది..? చనిపోవాలని ఎప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది..? అన్న విషయాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించారు. ఇలా ఆరేళ్లపాటు 10 వేల మంది స్పందనలను సేకరించారు. శీతాకాలంలో ఎక్కువ ఆత్మహత్యలు ఉంటాయని ప్రజలు భావించినప్పటికీ.. వసంత కాలం లేదా వేసవి తొలినాళ్లలోనే ఇవి అధికంగా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల సమయంలోనే అత్మహత్యలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇందుకు సంక్లిష్టమైన కారణాలు ఉన్నప్పటికీ డిసెంబర్‌లో ఆత్మహత్యల ఆలోచన అత్యంత దారుణంగా ఉండగా.. జూన్‌లో ఇటువంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటున్నాయని కనుగొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని