Zelensky: ‘రష్యా చేతిలో బందీ కావడం’ తీవ్ర అవమానకరమే..!

అధ్యక్ష భవనంపై రష్యన్లు (Russia) దాడి చేస్తే బందీగా లొంగడం (Captive) బదులు సహచరులతో పాటు తాను కూడా ప్రాణాలకు తెగించి పోరాడేవాడినని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) ఉద్ఘాటించారు.

Updated : 30 Apr 2023 15:49 IST

కీవ్‌: సైనిక చర్య పేరుతో రష్యా మొదలుపెట్టిన దురాక్రమణతో (Russia Invasion) ఉక్రెయిన్‌ మొత్తం నాశనమైంది! వేల మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు కొన్ని నగరాలు, పట్టణాలు నామరూపాల్లేకుండా పోయాయి. అయినప్పటికీ.. ఉక్రెయిన్‌ (Ukraince Crisis) మాత్రం ఏడాదికిపైగా తన ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన నాటి పరిస్థితులను గుర్తుచేసిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelensky).. అప్పట్లో తాను తుపాకీ పట్టుకొని తిరిగానన్నారు. తనపై రష్యన్లు దాడి చేస్తే బందీగా పట్టుబడటానికి బదులు తన సహచరులతో కలిసి ప్రాణాలకు తెగించి పోరాడే వాడినన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

‘అధ్యక్ష కార్యాలయంలోకి శత్రుమూకలు ప్రవేశిస్తే.. నేడు మేం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. బాంకోవా స్ట్రీట్‌ వద్ద కట్టుదిట్టమైన ప్రతిఘటన బలగాలు ఉండటం వల్ల ఒక్కరు కూడా ఖైదీలుగా మారలేదు. ‘ఉక్రెయిన్‌ అధ్యక్షుడు రష్యా చేతిలో బందీగా మారాడు’ అనే హెడ్‌లైన్‌ను మీరు ఊహించగలరా..? ఇది చాలా అవమానకరం. దాన్ని తలవంపుగా భావిస్తా’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఆ సమయంలో తన దగ్గరా ఒక తుపాకీ పెట్టుకున్నానని.. కాల్చడం ఎలాగో తెలుసని చెప్పారు. రష్యా సేనలకు పట్టుబడితే ఆత్మహత్య చేసుకోవడానికి ఆ తుపాకీ ఉపయోగించేవారా..?అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. శత్రువులపై దాడి చేసేందుకే దాన్ని తన వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టింది. ఆ సమయంలో కీవ్‌పై దాడి చేసేందుకు రష్యా బృందాలు ప్రయత్నాలు చేసినట్లు ఉక్రెయిన్‌ అధికారులు గుర్తించారు. అయితే, అధ్యక్ష భవన సముదాయాల్లోకి ప్రవేశించి దాడి జరిపేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదన్నారు. కీవ్‌ సమీపానికి రష్యా సైన్యం చేరుకున్నప్పటికీ ఉక్రెయిన్‌ బలగాలు ప్రతిఘటించడంతో నగరంలోకి ప్రవేశించలేకపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని