Zelenskyy: బఖ్‌ముత్‌ మొత్తం నాశనమైంది.. అక్కడేం మిగల్లేదు!

బఖ్‌ముత్‌ నగరం (Bakhmut) తమ స్వాధీనం అయినట్లు రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్‌ (Ukraine) స్పందించింది. రష్యా ప్రైవేటు సైన్యం (Wagner Group) ఆ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేసిందని పేర్కొంది.

Published : 21 May 2023 14:55 IST

కీవ్‌: ఏడాదికిపైగా సాగుతోన్న రష్యా దురాక్రమణను (Russia Invasion) ఉక్రెయిన్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. శక్తిమంతమైన ఆయుధాలతో మాస్కో దాడులకు తెగబడుతున్నప్పటికీ.. ప్రతిదాడులతో తమ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కీలక ప్రాంతమైన బఖ్‌ముత్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పుతిన్‌ వారిని స్వయంగా అభినందించినట్లు రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్‌ పేర్కొంది. రష్యా వాదనను అంగీకరించని ఉక్రెయిన్‌ (Ukraine).. ఎనిమిది నెలలుగా మాస్కో సేనల మద్దతుతో వాగ్నర్‌ ప్రైవేటు సైన్యం చేస్తున్న దాడులతో ఆ నగరం మొత్తం శిథిలమైందని పేర్కొంది.

‘మా సైన్యం వీరోచితంగా పోరాడింది. రష్యన్లు చెబుతున్నట్లుగా అక్కడ ఏమీ మిగల్లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రతి దానిని రష్యన్లు నాశనం చేశారు. కేవలం శిథల భవనాలు మాత్రమే మిగిలాయి. ఇది ఎంతో విషాదకరం. ప్రస్తుతానికి బఖ్‌ముత్‌ మా మనసుల్లో మాత్రమే ఉంది’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) వెల్లడించారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ఆయన.. రష్యా ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చారు.

ఇదిలా ఉండగా.. అత్యంత సుదీర్ఘ కాలం సాగిన పోరు తర్వాత బఖ్‌ముత్‌ (Bakhmut) నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ (Wagner Group) తెలిపింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇదే అధిక సమయం తీసుకుందని, శనివారం మధ్యాహ్నానికి నగరం మొత్తం రష్యా ఆధీనంలోకి వచ్చిందని ఓ వీడియో ప్రకటనలో వెల్లడించింది. అయితే, వాగ్నర్‌ సేన చేసిన ఈ ప్రకటనను ఉక్రెయిన్‌ ఖండించింది. గత 224 రోజులుగా ఉక్రెయిన్‌ సైన్యం అక్కడ వీరోచితంగా పోరాడుతోందని తెలిపింది. అయితే, భీకర దాడుల్లో 20వేలనుంచి 30వేల మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు అంచనా. ఇటు ఉక్రెయిన్‌ సైన్యం కూడా భారీగా ప్రాణనష్టం చవిచూసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని