Zelenskyy: మా భూభాగాల విముక్తికే.. రష్యాపై ఎదురుదాడి!

రష్యా ఆక్రమిత ప్రాంతాల విముక్తి కోసమే ఎదురుదాడులకు సిద్ధమవుతున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా భూభాగంపై దాడులు చేయబోమని స్పష్టం చేశారు.

Published : 14 May 2023 22:10 IST

బెర్లిన్‌: అమెరికా, బ్రిటన్‌ తదితర పాశ్చాత్య దేశాలు సమకూర్చిన ఆయుధాలతో రష్యా (Russia)పై ఎదురుదాడులకు ఉక్రెయిన్‌ (Ukraine) సిద్ధమవుతోందని వార్తలు వస్తోన్న వేళ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఆక్రమించిన తమ భూభాగాలను విముక్తి చేసేందుకే ఎదురుదాడుల (Counteroffensive)కు సిద్ధమవుతున్నామని, రష్యా భూభాగంపై దాడుల కోసం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జర్మనీ (Germany) పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ (Zelenskyy).. ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌తో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దుల ఆధారంగా ఉక్రెయిన్‌ భూభాగాలను రష్యా నుంచి విడిపించడమే తమ లక్ష్యమని తెలిపారు.

రష్యా భూభాగాలపైనా దాడి చేసి, కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకే ఉక్రెయిన్‌ ఎదురుదాడులకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. మాస్కోతో శాంతి చర్చల సందర్భంగా ఆక్రమిత భాగాలను బేరసారాలుగా ఉపయోగించుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ.. ‘మేం రష్యా భూభాగంపై దాడి చేయం. మాకంత సమయం లేదు. సామర్థ్యం కూడా లేదు. పైగా ఆయుధ సామగ్రి కూడా లేదు. కేవలం మా భూభాగాన్ని విముక్తి చేసేందుకు ఎదురుదాడికి సిద్ధం అవుతున్నాం’ అని తెలిపారు. ఈ క్రమంలోనే జర్మనీ తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అవసరం ఉన్నంతవరకు కీవ్‌కు సాయం అందిస్తామని షోల్జ్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ.. శనివారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, పోప్‌ ఫ్రాన్సిస్‌లతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలతోసహా రూ.24 వేల కోట్లకు పైగా సైనిక సాయాన్ని జర్మనీ ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే జెలెన్‌స్కీ ఇక్కడికి చేరుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు జర్మనీలో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా.. మొదట్లో ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడానికి వెనుకాడిన జర్మనీ.. ఇప్పుడు ఈ విషయంలో అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని