Zelenskyy: ‘ఉక్రెయిన్‌లో పర్యటించండి’.. ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ ఫోన్‌

స్విట్జర్లాండ్‌లో త్వరలో శాంతి సదస్సుకు హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

Published : 06 Jun 2024 21:12 IST

లండన్‌: రష్యా-ఉక్రెయిన్‌ మధ్య గడిచిన రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. దీనికి సంబంధించి స్విట్జర్లాండ్‌లో త్వరలో శాంతి సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. ఇందులో భారత్‌ పాత్ర అత్యున్నత స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. అంతేకాకుండా అవకాశం ఉన్నప్పుడు ఉక్రెయిన్‌ను కూడా సందర్శించాలని మోదీని ఆహ్వానించారు.

‘‘ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడా. ప్రభుత్వం త్వరగా ఏర్పాటై, భారత ప్రజల శ్రేయస్సు కోసం తన కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. త్వరలో జరగనున్న అంతర్జాతీయ శాంతి సదస్సుపైనా ఇరువురం చర్చించాం. అంతర్జాతీయ వేదికపై భారత్‌ భాగస్వామ్యం అత్యున్నత స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నాం. వీలైనప్పుడు ఉక్రెయిన్‌ను కూడా సందర్శించాలని ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించా’’ అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ ప్రాముఖ్యత, పాత్రను ప్రపంచంలోని ప్రతిఒక్కరూ గుర్తిస్తున్నారని జెలెన్‌స్కీ ఉద్ఘాటించారు. అన్ని దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు అందరం కలిసి పనిచేయడం ఎంతో కీలకమన్నారు. ఇదిలాఉంటే, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జూన్‌ 15-16 తేదీల్లో శాంతి సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందుకు 160కిపైగా దేశాలకు స్విస్‌ ఆహ్వానం పంపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని