ఈడీ విచారణకు పూరీ

ప్రధానాంశాలు

ఈడీ విచారణకు పూరీ

పదకొండు గంటల పాటు ప్రశ్నించిన అధికారులు

బ్యాంకు ఖాతాల పరిశీలన.. ఆర్థిక లావాదేవీలపై ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తొలిరోజు విచారణ సుదీర్ఘంగా సాగింది. ఈ కేసులో సినీపరిశ్రమకు చెందిన 12 మందిని విచారణకు హాజరవ్వాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆయన వెంట తనయుడు ఆకాశ్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ శ్రీధర్‌ ఉన్నారు. చివర్లో నిర్మాత బండ్ల గణేశ్‌ ఈడీ కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10.12 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన జగన్నాథ్‌ను అధికారులు రాత్రి 8.45 గంటల వరకు విచారించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలపై అధికారులు ఆరా తీశారు.  2017లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దర్యాప్తులో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు తెరపైకి వచ్చిన నేపథ్యంలో అంతకుముందు రెండేళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. ఎక్సైజ్‌శాఖ అప్పటి దర్యాప్తులో కెల్విన్‌ మస్కరెన్హస్‌, మైక్‌ కమింగా, రాన్సన్‌ జోసెఫ్‌, అలెక్స్‌ విక్టర్‌, మహ్మద్‌ ఉస్మాన్‌, అబూ బాబర్‌ తదితరులు విదేశాల నుంచి మాదకద్రవ్యాల్ని తెప్పించినట్లు తేలడంతో వారివద్ద నుంచి ఎవరెవరు కొనుగోలు చేశారు? డబ్బు ఎలా చెల్లించారు? విదేశాలకు చెల్లింపులు జరిగాయా? తదితర వివరాలను ఆరా తీయడంపైనే ఈడీ దృష్టి సారించింది. పూరీని ఆర్థిక లావాదేవీల గురించి అడిగినట్లు తెలిసింది. ఆయనను, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను వేర్వేరుగా విచారించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్లను వెంట తీసుకొచ్చిన జగన్నాథ్‌ వాటిని అధికారులకు సమర్పించినట్లు తెలియవచ్చింది. ఈక్రమంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసుల్లోని నిందితుల వాంగ్మూలాల ప్రకారం గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను.. జగన్నాథ్‌ స్టేట్‌మెంట్లలోని లావాదేవీలను పోల్చిచూసినట్లు సమాచారం. విదేశాల్లో సినిమా షూటింగ్‌లు జరిగిన సమయంలో చోటుచేసుకున్న లావాదేవీల గురించీ ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు మాదకద్రవ్యాల కొనుగోళ్లలో పెద్దఎత్తున హవాలా లావాదేవీలు జరిగాయనే ప్రచారం దృష్ట్యా వాటి గురించి ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. దాదాపు 11 గంటల విచారణ అనంతరం పూరీ తిరిగి వెళ్లిపోయారు. అవసరమైతే ఆయన్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

ఈడీ కార్యాలయానికి వెళ్లిన బండ్ల గణేశ్‌

ఓవైపు పూరీ జగన్నాథ్‌ విచారణ జరుగుతుండగానే బండ్ల గణేశ్‌ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి రావడంతో అధికారులు ఆయన్నీ పిలిచినట్లు ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే ఈడీ ఏమైనా నోటీసులిచ్చిందా? అని మీడియా అడగ్గా.. గణేశ్‌ స్పందిస్తూ.. ‘నాకు వక్కపొడే తెలియదు. ఈడీ నాకెందుకు నోటీసులు ఇస్తుంది?’ అంటూ ఎదురుప్రశ్న వేశారు. పూరీని పలకరిద్దామనే వచ్చానని చెప్పారు. జగన్నాథ్‌ను కలిసేందుకు ఆయన్ను అధికారులు అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు కార్యాలయ ఛాంబర్‌లో కూర్చుని పూరీ తనయుడు ఆకాశ్‌తో మాట్లాడినట్లు తెలిసింది. రాత్రి 7.45 గంటలకు కార్యాలయం నుంచి గణేశ్‌ వెళ్లిపోయారు.

 

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని