‘ఈ లేఆఫ్‌లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్‌ సమాధానమిదే..!

గూగుల్‌లో లేఆఫ్‌లపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై నేరుగా సీఈఓ సుందర్‌ పిచాయ్‌నే ప్రశ్నించారు.

Published : 10 May 2024 18:27 IST

Sundar Pichai | ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు.. ఆ తర్వాత కూడా కొనసాగాయి. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ టెక్‌ కంపెనీ అయిన గూగుల్‌ (Google) కూడా అందుకు మినహాయింపు కాదు. గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ కంపెనీ.. ఈ ఏడాది వందల సంఖ్యలో విడతలవారీగా తొలగింపులు చేపట్టింది. ఈనేపథ్యంలో లేఆఫ్‌లపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఉద్యోగులు నేరుగా సీఈఓ సుందర్‌ పిచాయ్‌నే ప్రశ్నించారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్‌హ్యాండ్స్‌ మీటింగ్‌లో పిచాయ్‌కు ఈ ప్రశ్న ఎదురైంది.

ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో లేఆఫ్‌ల గురించి ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయని పిచాయ్‌ను ప్రశ్నించారు. దీనిపై పిచాయ్‌ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ ఏడాది తొలి 6 నెలల పాటు ఈ లేఆఫ్‌లు కొనసాగుతాయని చెప్పారు. రెండో అర్ధభాగంలో కొద్ది సంఖ్యలో తొలగింపులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల గురించి ఈసందర్భంగా మాట్లాడారు. కొత్త నియామకాల విషయంలో గూగుల్‌ క్రమశిక్షణతో వ్యవహరించనుందని చెప్పారు. ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం కంటే ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని  వ్యవహరిస్తున్నట్లు ఉద్యోగులకు వివరించారు.

గో డిజిట్‌ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్‌ సైజ్‌ వివరాలు ఇవే..

ఈ సమావేశంలో మరికొన్ని ప్రశ్నలు సైతం పిచాయ్‌కు ఎదురయ్యాయి. త్రైమాసిక ఆదాయాల్లో ఊహించిన దానికంటే అధికంగానే కంపెనీ వృద్ధి నమోదు చేస్తున్నప్పటికీ.. కంపెనీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందని,  వేతనాల పెంపు చేపట్టడం లేదంటూ కొందరు ఉద్యోగులు ప్రశ్నించారు. లేఆఫ్‌ల వల్ల ఉద్యోగుల్లో నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతోందని, ఉద్యోగులకు, యాజమాన్యానికి మధ్య అంతరం పెరుగుతోందంటూ ఓ ఉద్యోగి పిచాయ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పిచాయ్‌ మాట్లాడుతూ.. మెరుగైన ఫలితాలొక్కటే కంపెనీ విజయాన్ని సూచించవన్నారు. గూగుల్‌ అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుందని, ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని పిచాయ్‌ సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని