Union Govt: గత ఐదేళ్లలో కేంద్రం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలెన్నంటే?

గత ఐదేళ్లలో భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఐదేళ్లలో 4.63లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపింది.

Published : 20 Jul 2023 20:19 IST

దిల్లీ: గత ఐదేళ్ల వ్యవధిలో 4.63 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం (Union Govt)వెల్లడించింది. 2023 మార్చి వరకు చేపట్టిన ఉద్యోగ నియామకాలకు సంబంధించిన గణాంకాలను గురువారం పార్లమెంట్‌(Parliament)కు అందజేసింది. 2018 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 వరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC), స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(RRB)లు 4,63,205 మందిని ఎంపిక చేసి ఉద్యోగాలకు సిఫారసు చేశాయని వెల్లడించింది. అలాగే, 2023-24 తొలి త్రైమాసికంలో నియామకం కోసం ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ వంటి నియామక సంస్థలు 1,03,196మంది అభ్యర్థులను సిఫారసు చేసినట్టు  కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌(Jitendra Singh) రాజ్యసభ(Rajya Sabha)కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

భారీ వేతనం.. ఏకలవ్య స్కూల్స్‌లో 6,329 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ప్రభుత్వం సూచిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళా అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు.  పలు మంత్రిత్వశాఖలు, విభాగాల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది నిరంతర ప్రక్రియ అని ఇంకో ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని